ప్ర‌ధాన‌మంత్రి మోదీ ఆకాంక్ష నెర‌వేర‌బోతోంది. చైనా నుంచి బొమ్మ‌ల దిగుమ‌తిని త‌గ్గించుకునేందుకు దేశీయంగా బొమ్మ‌ల త‌యారీ సంస్థ‌లు ఏర్పాటు కావాల‌ని చాలాసార్లు ఉద్ఘాటించారు. భారీ మొత్తంలో రాయితీలు కూడా ప్ర‌క‌టించ‌డంతో పెద్ద ఎత్తున ఈ రంగంలో పెట్టుబ‌డులు గుమ్మ‌రించేందుకు సంస్థ‌లు క్యూ క‌డుతున్నాయి. తాజాగా  కర్ణాటకలో దేశంలోనే అతి పెద్ద, మొదటి బొమ్మల తయారీ క్లస్టర్ రాబోతోంది. ఆకస్, ఫాక్స్‌కాన్బొ మ్మల తయారీ కంపెనీలు కర్ణాటకలో ఈ క్లస్టర్ ఏర్పాటుచేయబోతున్న‌ట్లు వెల్ల‌డించాయి. కర్ణాటకలోని కొప్పాల్ దగ్గర 400 ఎకరాల్లో మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నామని ఆక‌స్ ప్ర‌తినిధులు తెలిపారు.


 రూ.3,679 కోట్లుపెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావ‌డం విశేషం. 400 ఎకరాల్లో... ప్రత్యేకించి 300 ఎకరాల్ని విదేశాలకు ఎగుమతి చేసే బొమ్మల తయారీకి కేటాయిస్తున్నారు. మిగతా 100 ఎకరాల్ని దేశంలో అమ్మే బొమ్మల తయారీకి కేటాయిస్తున్నారు. మొత్తంగా చైనా బొమ్మ‌ల దిగుమ‌తిని అరిక‌ట్టేందుకు ప్ర‌ధాన‌మంత్రి మోదీ చ‌ర్య‌లు ఫ‌లిస్తున్నాయ‌నే చెప్పాలి. మనదేశంలో బొమ్మలు తయారవుతున్నా, దిగుమతుల వాటాయే ఎక్కువ ఉంటోంది. ఈ పరిస్థితిని మార్చాలని, మనదేశం టాయ్స్‌‌హబ్‌‌గా ఎదిగేలా స్టార్టప్‌‌లు, కంపెనీలు పనిచేయాలని ప్రధాని మోదీ చాలాకాలంగా చెబుతున్నారు.  వాస్త‌వానికి ఈ రంగంలో కొన్ని సమస్యలను పరిష్కరిస్తే ప్రభుత్వ ల‌క్ష్యం సాకారమవుతుందని చెబుతున్నారు వ్యాపారులు.


చైనా కంటే నాణ్యమైన బొమ్మలను తయారు చేయించడానికి మోదీ ప్రభుత్వం వీటికి బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) సర్టిఫికేషన్‌‌ను తప్పనిసరి చేసింది. సెప్టెంబరు నుంచి ప్రతి బొమ్మల కంపెనీలో బీఐఎస్‌ సర్టిఫికేషన్‌‌ కోసం టాయ్‌‌ టెస్టింగ్‌‌ ల్యాబ్స్‌‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించిన విష‌యం తెలిసిందే.  ఇదిలా ఉండ‌గా మిగ‌తా రంగాల్లోనూ చైనాతో వ్యాపారాల‌ను క్ర‌మంగా భార‌త్ త‌గ్గించుకుంటోంది. ఆసియాలో 14.14 ట్రిలియ‌న్ డాల‌ర్ల ప‌రిమాణంతో చైనాదే అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే అమెరికా (21.44 ట్రిలియ‌న్ డాల‌ర్లు) త‌ర్వ‌తి స్థానం చైనాదే. 2.94 ట్రిలియ‌న్ డాల‌ర్ల ప‌రిమాణంతో భార‌త్ ఐదో స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: