మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు వస్తే చాలు మేనిఫెస్టో ను విడుదల చేస్తూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మరో సారి మరో మేనిఫెస్టో ను విడుదల చేసారు. ఈ విషయం పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.420 వ్యవహారంగా ఉందని ఎద్దేవా చేశారు. ఐదేళ్లూ అధికారంలో ఉండి చేయలేని పనులను మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిపిస్తే చేస్తామనడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. మున్సిపల్‌ ఎన్నికలపై కడపలో వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తన పరిధిలో లేనివి, తాను చేయలేనివన్నీ మేనిఫెస్టోలో పెట్టి విడుదల చేయగా లోకమంతా నవ్విపోయిందన్నారు.


ఇప్పుడు ఆయన విడుదల చేసిన మేనిఫెస్టో దొంగల ముఠా వ్యవహారం లా ఉందని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, మున్సిపల్‌ ఎన్నికల మేనిఫెస్టోపై కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 2014 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలే ఇప్పుడు కూడా పెట్టారన్నారు. అప్పటి ఎన్నికల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్, ఒక వ్యక్తికి 20 లీటర్ల నీరు అంటూ హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. తాజాగా మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో ఏ ఒక్కటి కూడా చంద్రబాబు అమలు చేయలేరని, చేసే అవకాశం కూడా లేదని వ్యాఖ్యానించారు.


చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తిలా అసందర్భ ప్రేలాపనలు పేలుతున్నారని, ఆయన ఏం మాట్లాడుతున్నారో టీడీపీ వాళ్లకే అర్థం కావడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి కుటుంబానికి పెద్దగా వారి బాగోగులు ఆలోచించి సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఇది ప్రజల హృదయాలకు ఆయనను దగ్గర చేసిందన్నారు. ఇక రానున్న మూడేళ్ల వరకు రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు లేవు.. టీడీపీ ఇప్పటికైనా కళ్లు తెరచి దుకాణాన్ని మూసేస్తే బెస్ట్ అని అన్నారు. తండ్రికి వయసై పోయిందని.. కొడుకు లోకేశ్‌ అయినా నేర్చుకుంటాడనుకుంటే అదీ లేదన్నారు. నోటికొచ్చినట్లు తిట్టుకుంటూ పోతే వారి ఖర్మ అని వదిలేయడం తప్ప మరేం చేయలేమన్నారు. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కూడా వైసీపీ కి అనుకూలంగా వస్తాయని ధీమాను వ్యక్తం చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: