ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంతో ఇష్టపడి చేయించిన ఈవాచ్ యాప్ అమలు విషయంలో హైకోర్టు మోకాలడ్డింది. ప్రభుత్వ యాప్ లని తోసిరాజని, ఎస్ఈసీ ఈ యాప్ ని సొంతంగా డిజైన్ చేయించారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఈ యాప్ ద్వారా తమకు తెలియజేయాలని కోరారు. ఒకరకంగా వైసీపీ నేతల్లో ఈ వాచ్ యాప్ పెద్ద కలవరమే సృష్టించింది. ఈ యాప్ ద్వారా లేనిపోని ఇబ్బందులు వస్తాయని, అధికార పక్షాన్ని టార్గెట్ చేసుకుంటున్నారని, ప్రతిపక్షాలకు లబ్ధి చేకూరుస్తారని విమర్శించింది. ఈవాచ్ యాప్ భద్రతపై సందేహాలు లేవనెత్తడంతో హైకోర్టు యాప్ ని అమలులోకి రాకుండా అడ్డుకుంది. యాప్ భద్రతను, దాని పనితీరుని ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ధృవీకరించిన తర్వాతే అమలులోకి తెస్తామని తేల్చి చెప్పింది.

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సొంతగా రూపొందించుకున్న ఈవాచ్‌ యాప్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ లేవనెత్తిన 24 సందేహాలు, అభ్యంతరాల్లో కేవలం ఆరింటికే ఎస్‌ఈసీ ఇప్పటి వరకు స్పందించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. మిగిలిన వాటికి స్పందన రావాల్సి ఉందని తెలిపింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఈవాచ్ యాప్ పై చేపట్టిన విచారణను మార్చి 5కి వాయిదా వేసింది.

ఈ వాచ్‌ యాప్‌ను ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ యాప్‌ లైన ‘సీ–విజిల్‌’, ‘నిఘా’ యాప్‌లను ఉపయోగించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన న్యాయవాదులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్ అనుమతి కోరింది. అయితే ఏపీటీఎస్ఎల్ లేవనెత్తిన సందేహాల్లో కొన్నింటికి మాత్రమే ఈసీ స్పందించింది. మిగతావాటిపై స్పందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో ఈవాచ్ యాప్ అమలు ప్రశ్నార్థకంగా మారింది. మార్చి 5నాటికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందనపై ఈవాచ్ యాప్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: