విశాఖ నగరం జనాభా పాతిక లక్షలు. జీవీఎంసీ ఎన్నికల్లో దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది ఓటర్లుగా ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కుని వినియోగించి ఘన చరిత్ర ఉన్న విశాఖకు మేయర్ ని ఎన్నుకుంటారు. విశాఖ మేయర్ గా ఎందరో ప్రముఖులు పనిచేశారు. అయితే ఈసారి ఎవరు అవుతారు అన్నది అతి పెద్ద చర్చగా ఉంది.

ఇదిలా ఉంటే ఈసారి రిజర్వేషన్ల తీరు చూస్తే చిత్రంగా ఉంది. భీమిలీ, అనకాపల్లి మునిసిపాలిటీలను కలుపుకుని జీవీఎంసీ వార్డులను 98గా పెంచారు. అంటే రెండు తక్కువ వంద అన్న మాట. ఇందులో సగానికి సగం అంటే 48 సీట్లు మహిళలకే రిజర్వ్ చేశారు అంటే రేపటి రోజున జీవీఎంసీని శాసించేది నారీలోకమే అన్న మాట. దీంతో చాలా చోట్ల నాయకుల భార్యలు, బంధువులే  మహిళా అభ్యర్ధులుగా బరిలోకి దిగిపోయారు. అలాగే కొత్త వారు కూడా రావడంతో ఈసారి ఎన్నికలో ఇదే ప్రత్యేకత అంటున్నారు.

ఇక జోన్ల వారీగా చూస్తే విశాఖ వన్ లో తొమ్మిది వార్డులు  ఉంటే ఇందులో ఎనిమిది సీట్లు మహిళలకే రిజర్వ్ చేశారు. అంటే ఇక్కడ ఒకే ఒక్క వార్డు నుంచి మాత్రమే పురుషులు పోటీలో ఉన్నారన్న మాట. ఇక జోన్ టూ లో చూసుకుంటే 14 వార్డులు ఉన్నాయి. ఇందులో తొమ్మిది వార్డులు మహిళలకే రిజర్వ్ చేశారు.  అలాగే జోన్ త్రీలో 12 వార్డులు ఉంటే ఇందులో ఆరింటిని మహిళలకు రిజర్వ్ చేశారు. జోన్ నాలుగులో చూసుకుంటే 24 వార్డులకు గానూ 10 వార్డులు మహిళలకు కేటాయించారు. అలాగే జోన్ అయిదులో చూసుకుంటే 20 డివిజన్లు ఉన్నాయి. ఇందులో నాలుగు డివిజన్లు మహిళలకు కేటాయించారు. ఇక అనకాపల్లి జోన్ లో అయిదు వార్డులు ఉంటే అయిదూ కూడా మహిళలకే రిజర్వ్ చేయడం విశేషం. ఇక భీమిలీ జోన్ లో నాలుగు డివిజన్లు ఉంటే మూడు మహిళలకు కేటాయించారు. మొత్తంగా చూస్తే ఎవరు మేయర్ కావాలన్నా కూడా మహిళల మద్దతు లేకపోతే కష్టం. ఇక మేయర్ సీటుని బీసీ మేల్ కి కేటాయించరు. దాంతో డిప్యూటీ మేయర్ కచ్చితంగా మహిళలకు ఇస్తారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: