ఎన్నికలు అంటేనే చిత్రాలు చాలా ఉంటాయి. కానీ ఇపుడు జరుగుతున్నది మాత్రం చిత్రాతిచిత్రంగా చెప్పుకోవాలి. ఎన్నికల్లో ఎంతమంది అభ్యర్ధులు పోటీ చేయడానికి ముందుకు వచ్చినా కూడా చివరికి అఫీషియల్ గా పోటీలో ఉండేది ఒక్కరే అవుతారు. కానీ అదేంటో తెలియదు కానీ అధికార పార్టీ వైసీపీలో అతి పెద్ద గందరగోళం రాజ్యం చేస్తోంది.

విశాఖ మేయర్ సీటు తమకు అత్యంత ప్రతిష్టాత్మకం అని చెప్పుకునే వైసీపీ టికెట్ కేటాయింపుల్లో చేస్తున్న పొరపాట్లు చివరకు అటు ఇటూ తిరిగి ఆ పార్టీ పుట్టె ముంచనున్నాయని అంటున్నారు. విశాఖ శివారు ప్రాంతం, పారిశ్రామిక వాడ అయిన గాజువాకలోని 76వ వార్డులో అత్యంత విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇక్కడ వైసీపీ నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. వీరంతా తామే అసలైన అధికారిక అభ్యర్ధులమని ప్రచారం చేసుకోవడం  విశేషం.

వీరందరికీ వైసీపీ పెద్దలు హామీ ఇచ్చేశారు. దాంతో ఎవరికి వారే రంగంలోకి దిగిపోయారు. ఆ విధంగా వీరంతా ప్రచారం చేసుకోవడంతో ఎవరు అసలు అభ్యర్ధులో ఎవరికి బీ ఫారం వస్తుందో తెలియక మొత్తం క్యాడరే గందరగోళంలో పడింది. అంతే కాదు వీరంతా తమకు బీ ఫారం ఇవ్వకపోతే రెబెల్ గా బరిలో ఉంటామని తెగేసి చెప్పడంతో అధినాయకత్వం తల పట్టుకుంటోంది. అందరినీ కూర్చోబెట్టి సర్దుబాటు చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది అంటున్నారు. ఈఅ ఇదే విధంగా మరో వైపు చూస్తే విశాఖ సౌత్ లో కూడా కొన్ని వార్డుల్లో ముగ్గురేసి నలుగురేసి వైసీపీ అభ్యర్ధులు ప్రచారంలో ఉన్నారు. వీరిలో ఎవరి తమ అభ్యర్ది  అన్నది కార్యకర్తలకు కూడా తెలియడంలేదు. ఇలాగైతే మొత్తం పార్టీ విజయావకాశాలపైన ఇది దెబ్బ తీస్తుంది అంటున్నారు. మరో వైపు ఎమ్మెల్యేలు కొంతమంది చేస్తున్న పనుల వలన, గతంలో ఇచ్చిన హామీల వల్లనే ఇలా ఎక్కువ మంది అభ్యర్ధులు తయారు అయ్యారు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: