విజయనగరానికి కార్పొరేషన్‌ హోదా వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. తొలిసారి మేయర్‌ పీఠం.. ఈ అవకాశం  ఎలాగైనా దక్కించుకోవాలి. ఇదీ  విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని పార్టీల ప్రయత్నం.  విజయనగరం విషయానికి వస్తే.. ఇక్కడి కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా వైసీపీ నుంచి 112 మంది నామినేషన్లు వేశారు. ఇక ఇప్పుడు ప్రచారం ఉధృతమవుతోంది. విజయనగరంలో ప్రధాన పార్టీల విషయానికి వస్తే..అటు ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి.. ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నాయకుడు పూసపాటి అశోక్ గజపతి రాజులకు ఈ ఎన్నికల చాలా ప్రతిష్టాత్మకం.

విచిత్రం ఏంటంటే.. ఇంత ప్రతిష్టాత్మకం అయినా.. ఈ ఇద్దరు నాయకులు ఇంకా ప్రచార పర్వంలోకి దిగలేదు. మరోవైపు తొలిసారి కార్పొరేషన్ హోదాలో ఎన్నికలు జరుగుతున్న విజయనగరం నగర పాలకసంస్థలో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ఈసారి ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో మహిళా నాయకత్వం ముందుకు దూసుకొస్తోంది. ఇప్పుడు ఇదే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి కుమార్తె శ్రావణి ప్రచారంలో దూసుకుపోతున్నారు.

అటు ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నాయకుడు పూసపాటి అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతి కూడా తమ కార్పొరేట్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచార బాధ్యతలను  తీసుకున్నారు. ఇటు కోలగట్ల, అటు అశోక్ గజపతి రాజు అడపాదడపా సమావేశాల్లో పాల్గొంటున్నారు తప్పించి ప్రచారంలోకి దిగలేదు. ఇక సీనియర్ అశోక్ గజపతిరాజు అయితే ప్రచారానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. అన్నీ ఆయన కుమార్తె అదితికే అప్పగించేశారు.

సో.. ఇక్కడ ప్రచారం బాధ్యత అంతా ప్రధాన నాయకుల కుమార్తెల భుజస్కంధాలపైనే పడింది. ఎలాగూ వీరిద్దరూ తమ రాజకీయ వారసులుగా కుమార్తెలను ప్రకటించేశారు. ఇప్పుడు ఈ కార్పొరేట్ ఎన్నికల సమయంలో ఇది వారికి ఓ మంచి అనుభవం అవుతుందని భావిస్తున్నట్టున్నారు. అటు శ్రావణి, ఇటు అదితి కూడా తమ పార్టీల అభ్యర్థుల కోసం ప్రచారం ఉధృతం చేస్తూ దూసుకుపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: