రాజకీయాల్లో నిన్న ఉన్నది నేడు ఉండదు, నేటి ధీమా రేపు అసలు కనిపించదు. అదే పొలిటికల్ మ్యాజిక్. మొత్తానికి పిట్ట పోరు పిల్లి తీర్చింది అన్నట్లుగా ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన పోరు సీటు కోసం స్వీటుగా జరిగిన వార్ కి ఒక ముగింపు వచ్చినట్లుగా చెబుతున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికను ఏప్రిల్  6న నిర్వహిస్తారు అని అంటున్నారు.

అంటే గట్టిగా అయిదు వారాలు కూడా లేరు. దాంతో ఇక అభ్యర్ధుల ఎంపిక వ్యవహారాన్ని ప్రధాన పార్టీలు చేపడతాయి అంటున్నారు. తిరుపతి ఎంపీ సీటులో పోటీ చేయడానికి జనసేన ఓ వైపు ఉరుకుతోంది. అదే సమయంలో బీజేపీ నుంచి కూడా గట్టిగానే పోటీ ఉంది. ఆ మధ్యంతా బీజేపీ పోటీకి రెడీ అంటూ చాలా హడావుడి చేసింది. అది తెలంగాణాలోని దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ సీట్లు ఒక్కసారిగా పెరగడంతో వచ్చిన ధీమా. ఏపీలో బీజేపీకి పెద్దగా పట్టులేకపోయినా కూడా అక్కడ ఊపు చూసుకుని ఇక్కడ జెండా ఎగరేస్తామని బాగానే సౌండ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ సీటు విషయంలో గట్టిగానే పట్టుపడుతున్నారు. ఇప్పటికి రెండు సార్లు ఆయన ఢిల్లీ టూర్ చేసి వచ్చారు. బీజేపీ పెద్దలను కలసి తమకే సీటు కేటాయించాలని కోరారు.


అయితే నాడు అంతా బెట్టు చేసిన బీజేపీ ఇపుడు మాత్రం ఒక్కసారిగా దాన్ని సడలించింది  అంటున్నారు. అదేలా అంటే విశాఖ ఉక్కు దెబ్బతో దిగివచ్చింది అంటున్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలనుకోవడంతో ఒక్కసారిగా బీజేపీకి ఏపీలో వ్యతిరేకత పెరిగింది. దాంతో తిరుపతిలో పోటీ చేస్తే ఉన్న పరపతి పోతుంది అని అంటున్నారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో చూసుకున్నా బీజేపీ కంటే జనసేన మంచిగా ఉనికి చాటుకుంది. దీంతో బీజేపీ తాను పక్కన ఉండి జనసేనకు అవకాశం ఇస్తే కొంతలో కొంత బెటర్ గా ఉంటుందని ఆలోచిస్తోందిట. మొత్తానికి ఇపుడు జనసేనకు తిరుపతి నుంచి టికెట్ ఖాయమని అంటున్నారు. మరి సీటు సరే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: