ఒకే దేశం - ఒకే ఎన్నిక అంటూ మొద‌టి నుంచి చెబుతూ వ‌స్తోన్న ఎన్డీయే ప్ర‌భుత్వం ఆ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా ప‌శ్చిమబెంగాల్‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయిగా జ‌మిలి ఎన్నిక‌లు ఉండ‌క‌పోవ‌చ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ వాటివారి వాటిదే.. జ‌మిలి దారి జ‌మిలిదే అనే రీతిలో కేంద్రంం ఉంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా జ‌మిలి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం ఆ ప‌ట్టుద‌ల‌ను బ‌య‌ట‌కు క‌న‌ప‌డ‌నీయ‌కుండా చాప‌కింద నీరులా త‌న ప్ర‌య‌త్నాలు తాను చేస్తోంది. 2022 చివ‌రిలో జ‌మిలి ఎన్నిక‌లు నిర్వ‌హించేలా ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించిన‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఎదుర‌వ‌కుండా ఉండేందుకు లా క‌మిష‌న్ ఒక ఫ్రేమ్ వ‌ర్క్ ను రూపొందించే ప‌నిలో ఉంది.

బీజేపీ పాలిత ప్రాంతాలు జమిలిని దృష్టిలో పెట్టుకునే ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్ర పథకాలను విరివిగా వినియోగించుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎటుచూసినా జమిలి ఎన్నికలపై వామ‌ప‌క్షాలు మిన‌హా ఇత‌ర‌ పార్టీల నుంచి పెద్దగా వ్యతిరేక‌త క‌న‌ప‌డ‌టంలేదు. గతేడాది నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో 22 పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతు ప్రకటించాయి. సిబ్బంది,  ప్రజా సమస్యలు, న్యాయ శాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయూ సంఘం జమిలి ఎన్నికలకు సంబంధించి అధ్యయనం చేయడమే కాక, ఎన్నికల సంఘంతోనూ చర్చించి తన 79వ నివేదికలో కొన్ని సిఫారసులు చేసింది. వీటన్నింటినీ లా కమిషన్ కూలంకుషంగా ప‌రిశీలిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా జమిలి ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమేనని గ‌తంలోనే ప్రకటించింది. ఈ పరిణామాలన్నీ వచ్చే ఏడాది చివరిలోగా జమిలి ఎన్నిక‌ల రూపకల్పన కొలిక్కి వచ్చే అవకాశాలను తెలియజేస్తున్నాయి.

వాస్తవానికి దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతరం కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవటం, గడువుకు ముందే పలు రాష్ట్రాలు శాసనసభలను బర్తరఫ్‌ చేయటం వంటి కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జ‌రిపారు. 1983లోనే నాటి ఎన్నికల సంఘం చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని ప్రతిపాదించింది. 1999లో లా కమిషన్‌ ఇదే సూచన చేసింది.  జమిలికి సిద్ధమని 2017లో నాటి సీఈసీ ఓపీ రావత్‌ ప్రకటించారు. 2021నాటికి రెండు దశలుగా జమిలి ఎన్నికలు జర‌పొచ్చంటూ నీతి ఆయోగ్‌ గతంలో ఒక నివేదికను సమర్పించింది. స్వీడన్‌, ఇండొనేషియా, దక్షిణాఫ్రికా, జర్మనీ, స్పెయిన్‌, హంగరీ, బెల్జియం, పోలాండ్‌, స్లోవేనియా, అల్బేనియా తదితర దేశాల్లో చట్టసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయి. జ‌మిలి ఎన్నిక‌ల విధానం అమ‌ల‌వుతున్న చాలా  దేశాల్లో అధ్యక్ష తరహా పాలన ఉండటం గమనార్హం.

ఆయా దేశాల‌కు, భార‌త‌దేశానికి చాలా తేడాలున్న‌ప్ప‌టికీ,  త‌న రాజ‌కీయ‌, ఆర్థిక అవ‌స‌రాలు ఎన్ని ఉన్న‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వం, న‌రేంద్ర‌మోడీ ఆద్వ‌ర్యంలో ఎన్డీయే ప్ర‌భుత్వం జ‌మిలికి వెళ్లాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించుకున్న‌ట్ల ఈ ప‌రిణామాల‌నుబ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. కొద్దికాలం వేచిచూస్తే స‌రి!!.

మరింత సమాచారం తెలుసుకోండి: