వాషింగ్టన్: ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు ఇచ్చేందుకు సర్కార్ రెడీ అవుతోంది. దీనికోసం ఓ బిల్లును కూడా దిగువ సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. ఇక ఎగువసభలో ఆమోదం పొందడం మాత్రం మిగిలుంది. అక్కడ కూడా ఈ బిల్లు ఆమోదం పొందితే ఇక దేశంలోని ప్రతి ఒక్కరికీ ఒక లక్ష రూపాయలు లభించనున్నాయి. అయితే ఆనందపడకండి ఇదంతా మన దేశంలో కాదు. అగ్రరాజ్యం అమెరికాలో. అక్కడ కొత్తగా అధ్యక్షుడైన జో బైడెన్ తీసుకున్న నిర్ణయమిది. బైడెన్ అధ్యక్షుడైన తరువాత ఈ బిల్లును ఆయన ప్రధానంగా వెలుగులోకి తీసుకొచ్చారు.

బైడెన్ సర్కార్ ప్రవేశపెట్టిన ఈ కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ శనివారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు సెనేట్‌లో కూడా ఆమోదం పొందితే అమెరికన్ల అకౌంట్లలోకి 1,400 డాలర్లు వచ్చి పడనున్నాయి. కరోనా మహమ్మారి పంజా విసరడంతో అమెరికాలో కోట్లాది మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. దీంతో అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి బైడెన్ భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు.

 దీనికి సంబంధించిన బిల్లకు అమెరికా ప్రతినిధుల సభలో ఈ రోజు(శనివారం) ఆమోదం లభించింది. 219-212 ఓట్ల తేడాతో ఈ బిల్లుకు సభ ఆమోదం లభించింది. అయితే మొదటి నుంచి ఈ ప్యాకేజీని వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లు.. ఈ ఓటింగ్‌లో వ్యతిరేకించారు. అంతేకాకుండా డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు కూడా ఈ బిల్లును వ్యతిరేకించడం కొసమెరుపు.

వచ్చే వారం ఈ బిల్లుపై ఎగువసభలో చర్చ జరగనుంది. సెనేట్ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే చిన్నతరహా పరిశ్రమలతోపాటు రాష్ట్రాలకు ఆర్థిక లబ్ధి చేకూరనుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా జరిగేందుకు మార్గం సులువవుతుంది. అంతేకాకుండా వార్షిక ఆదాయం 75వేల డాలర్ల కంటే తక్కవగా ఉన్న ఒక్కో అమెరికా పౌరునికి నేరుగా 1,400 డాలర్లు లభించనున్నాయి. మరి అక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: