గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటి వరకూ ప్రతిపాదనలుగానే ఉన్న బయోమెట్రిక్ హాజరను తప్పనిసరిచేస్తూ ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాదు బయోమెట్రిక్ హాజరుకి జీతానికి లింకు పెడుతూ తీసుకొచ్చిన నిబంధన కచ్చితంగా అమలు చేయబోతున్నారు. దీని ప్రకారం బయోమెట్రిక్ పడకపోతే జీతం కట్ అన్నమాట. అంతే కాదు, ఉదయం ఠంచనుగా డ్యూటీకి వచ్చి సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ప్రజలకు కచ్చితంగా సచివాలయంలోనే అందుబాటులో ఉండాలి. స్పందన కార్యక్రమాన్ని ప్రతిరోజూ నిర్వహించాలి.

గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రజల సమస్యలను నిత్యం తెలుసుకుని, త్వరితగతిన పరిష్కరించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి రోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాల బాధ్యతలు నిర్వహిస్తున్న జాయింట్‌ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పని దినాల్లో గ్రామ, వార్డు సచివాలయాలన్నింటిలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు సిబ్బంది అంతా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండేలా చూడాలని  గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిబ్బంది కార్యాలయం నుంచి వెళ్లే ముందు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ పంచ్‌ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అందరికీ బయో మెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేయాలని, ఈ హాజరు ఆధారంగానే వారికి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సచివాలయ సిబ్బంది ఈ కింది విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలి.
- దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోనే అర్హులైన వారికి ఆరోగ్య శ్రీ కార్డు మంజూరు చేయాలి.
- దరఖాస్తు చేసుకున్న అర్హులకు పది రోజుల్లోనే బియ్యం కార్డు మంజూరు చేయాలి.
- పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే అర్హులకు 21రోజుల్లో పెన్షన్ కార్డు ఇవ్వాలి.
- అర్హులకు 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టా ఇవ్వాలి.
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ ఉన్నందున కొత్త మంజూరులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. కోడ్‌ ముగిసిన తర్వాత యథావిధిగా అర్హులైన వారికి నిర్ణీత కాల వ్యవధిలో ఆయా పథకాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: