రాష్ట్రంలో కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. అన్ని కార్పొరేష‌న్ల‌లోనూ బెజ‌వాడ కార్పొరేష‌న్‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఇక్క‌డ నాయ‌కులు.. రాజ‌కీయంగా భిన్న‌మైన వాతావ‌ర‌ణం .. ఇక్క‌డ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్ర‌స్తుతం అధికార పార్టీకి కీల‌క నేత‌లు ఉన్నారు. అదేస‌మ‌యంలో టీడీపీలోనూ కీల‌క నేత‌లు ఉన్నా.. వారిలో వారు ర‌గ‌డ ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రికివారుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. ఎవ‌రికివారుగా రాజ‌కీయం చేస్తున్నా.. అంద‌రి ల‌క్ష్యం మాత్రం టీడీపీని గెలుపు గుర్రం ఎక్కించ‌డ‌మే! ఈ క్ర‌మంలో అంద‌రూ కృషి చేస్తున్నారు.

వీరిలో బుద్దా వెంక‌న్న‌, నాగుల్ మీరా.. ఎంపీ కేశినేని నాని, బొండా ఉమా.. వంటి వారితోపాటు.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి వ‌చ్చిన జ‌లీల్ ఖాన్ వంటివారు కూడా వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. వీరంతా ఎలా ఉన్నా.. యువ నాయ‌కుడు.. బ‌ల‌మైన పొలిటిక‌ల్ ఫ్యామిలీకి చెందిన వంగ‌వీటి రాధా కూడా త‌న‌దైన శైలిలో రాజ‌కీయాలు చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనే త‌న‌కు ఆశించిన టికెట్ ఇవ్వ‌లేద‌న్న కార‌ణంగా వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన రాధా.. వైసీపీని ఓడిస్తాన‌ని ప‌ట్టుబ‌ట్టారు. అయితే.. అది సాధ్యం కాలేదు.

కాగా.. ఇప్పుడు విజ‌యవాడ కార్పొరేష‌న్‌లో వైసీపీని అంద‌లం ఎక్కించేందుకు ఆయ‌న కృషి చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో 21 మున్సిపల్‌ డివిజన్లు ఉన్నాయి. ఈ  21 చోట్ల టీడీపీ లేదా జనసేన అభ్యర్థులే గెలిచేలా రాధా తెర‌వెనుక చ‌క్రం తిప్పుతున్న‌ట్టు తెలిసింది. టీడీపీ బలమున్న చోట జనసేన, జనసేన బలమున్నచోట టీడీపీ కలిసి పనిచేయాలని.. వైసీపీని ఓడించాలని రాధా ప‌క్కా ప్ర‌ణాళిక సిద్దం చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఒక నేత రెండు పార్టీల రాజ‌కీయం ఇప్పుడు బెజ‌వాడ హాట్ టాపిక్ అయ్యింది.

ఉద‌యం లేచింది మొద‌లు .. కార్య‌క్ర‌మాల రూప‌కల్ప‌న‌తో పాటు పార్టీని న‌డిపించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాను కూడా టీడీపీతోపాటు అవసరమైన చోట జనసేన తరఫున కూడా ప్రచారం చేస్తానని రాధా హామీ ఇచ్చినట్టు తెలిసింది. మరి.. బలంగా ఉన్న అధికార పార్టీని ఢీకొట్టడంలో రాధా వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. ప్ర‌స్తుతం సెంట్ర‌ల్ ప‌రిధిలో రాధా బ‌లం అంతంత‌మాత్ర‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: