త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షంలో ఉన్న డీఎంకే,  పుదుచ్చేరిలో భార‌తీయ జ‌న‌తాపార్టీ విజ‌యం సాధించ‌బోతున్న‌ట్లు ఓ స‌ర్వే తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 6న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏబీపీ-సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ సర్వే ప్రకారం...తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకె, కాంగ్రెస్ కూటమి 154-162 సీట్లు గెలుచుకోబోతున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. మొత్తంగా 41శాతం ఓటింగ్ ఈ కూట‌మికి దక్కే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.

అన్నాడీఎంకె, బీజేపీ, ఇతరులతో కూడిన ఎన్డీయే కూటమి కేవలం 28.61శాతం ఓట్లతో 58-66 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు స‌మాచారం. కమల్ హాసన్ నాయకత్వంలోని మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి 2-6 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అన్నాడీఎంకె, బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమికి మొత్తం 234 సీట్లలో 43.7శాతం ఓటింగుతో 136 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో డీఎంకెకు 39.4శాతం ఓట్లతో 98 సీట్లు వచ్చాయి.

 కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఈసారి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉన్నట్లు ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో వెల్లడైంది. ఆ పార్టీ, దాని మిత్రపక్షాలకు కలిపి 17-21 సీట్లు,కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు కలిపి 8-12 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. కాగా,తమిళనాడులో ఏప్రిల్ 6న రాష్ట్రవ్యాప్తంగా ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పుదుచ్చేరిలోనూ ఏప్రిల్ 6వ తేదీనే ఎన్నికలు జరగనున్నాయి. ఫ‌లితాలు మే 2న వెల్ల‌డి కానున్నాయి. సీట్ల పంప‌కాల‌పై పార్టీల మ‌ధ్య పొత్తు చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అసోం, బెంగాల్, కేరళ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు కూడా మే 2న వెల్లడికానున్నాయి. ఈసారి ఎన్నికల్లో అన్నాడీఎంకె-బీజేపీ, డీఎంకె-కాంగ్రెస్ పొత్తుతో బరిలో దిగనున్నాయి. ఈ మేరకు సీట్ల పంపకాలపై ఇప్పటికే చర్చలు మొదలుపెట్టాయి మ‌రోవైపు క‌మ‌ల్‌హాస‌న్ మూడోకూట‌మిపై దృష్టిపెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: