గుంటూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ‌కు 16 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ 16 సంవ‌త్స‌రాల నుంచి న‌గ‌రంలో అభివృద్ధి పూర్తిస్థాయిలో కుంటుప‌డింది. గుంటూరు రూర‌ల్ ప‌రిధిలోని ప‌లు గ్రామాల‌ను న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లో విలీనం చేసే క్ర‌మంలో ప‌లు కోర్టు కేసులు ఎదుర‌య్యాయి. దీంతోపాటు ప‌లు పంచాయితీలు కోర్ట‌ను ఆశ్ర‌యించ‌డంతో ఈ 16 ఏళ్లుగా న‌గ‌రపాల‌క సంస్థ‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేక‌పోయారు. కోర్టు కేసుల‌న్నీ ఓ కొలిక్కి రావ‌డంతో ఎట్ట‌కేల‌కు గుంటూరు న‌గ‌ర ప్ర‌జ‌లు త‌మ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌కు ఓటు వేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. న‌గ‌రంలో ఎక్క‌డ చూసినా రోడ్ల‌మీద గుంత‌లుండి గుంటూరు పేరు బ‌దులు గుంత‌లూరుగా మార‌డమే ఇక్క‌డ ప్ర‌ధాన స‌మ‌స్య‌గా ఉంది. ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి రాక‌పోక‌లు సాగించడంక‌న్నా గుంటూరు నుంచి హైద‌రాబాద్ వెళ్లిరావ‌డం ఉత్త‌మ‌ని న‌గ‌ర ప్ర‌జ‌ల భావ‌న‌.

గుంటూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీల మ‌ధ్య హోరాహోరీ పోరు నెల‌కొంది. ఎలాగైనా మేయ‌ర్ పీఠాన్ని కైవ‌సం చేసుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఇరుపార్టీలున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మేయ‌ర్ అభ్య‌ర్థి ఖ‌రార‌వ‌క‌పోయిన‌ప్ప‌టికీ తెలుగుదేశం పార్టీలో మాత్రం ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి కోవెల‌మూడి నానినే మేయ‌ర్ అభ్య‌ర్థి అవుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీలో పోటీప‌డుతున్న అభ్య‌ర్థుల జాబితా కొండ‌వీటి చేంతాడంత ఉండ‌టంతో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క వార్డు స్థానానికి కూడా అభ్య‌ర్థి ఖ‌రారు కాలేదు. ఇది ఆ పార్టీకి మైన‌స్‌గా మారింది. కొత్త అభ్య‌ర్థులు తెర‌పైకి వస్తుండ‌టంతో ఎప్ప‌టినుంచో ప్ర‌చారం చేసుకుంటున్న‌వారు వెన‌క‌బ‌డిపోతున్నారు. దీంతో స‌హ‌జంగానే ఆయా ప్రాంతాల్లో అభ్య‌ర్థుల మ‌ధ్య ఐక‌మ‌త్యం కొర‌వ‌డింది.

గుంటూరు నగరపాలకసంస్థ ఎన్ని కలపై టీడీపీ మమ్ముర కసరత్తు చేస్తోంది. కార్పొరేటర్‌ అభ్యర్థుల జాబితాపై ఇప్పటికే  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంగళగిరి కేంద్ర కార్యా లయంలో జిల్లా ముఖ్యనేతలతో వరుస సమావేశాలు నిర్వ హించారు. ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌, మేయ‌ర్ అభ్య‌ర్థి కోవెల‌మూడి నాని త‌దిత‌రులు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.  తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో ఒకటికంటే ఎక్కువ మంది నేతలు నామినేషన్లు వేశారు. అభ్య‌ర్థుల‌ను సిద్ధం చేయ‌డం, వారికి బీఫారాలు అందించ‌డం, ప్ర‌చారంలో తెలుగుదేశం పార్టీ ముందంజ‌లో ఉంది. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యేవ‌ర‌కు వైసీపీ అభ్య‌ర్థుల జాబితా తేల‌క‌పోతుండ‌టంతో విజ‌యావ‌కాశాలు తెలుగుదేశం పార్టీకే ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: