వామ‌న్‌రావు న్యాయ‌వాద దంప‌తుల కేసులో నిందితుడిగా ఉన్న పెద్ద‌ప‌ల్లి జ‌డ్పీచైర్మ‌న్ పుట్ట‌మ‌ధు అల్లుడు బిట్టుశ్రీను పాత్ర‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. బిట్టు శ్రీనుకు ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి మంథని కోర్టు శనివారం నాడు అనుమతినిచ్చింది. ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణిని నడిరోడ్డు పై నరికి చంపిన కేసులో ప్రధాన నిందితులుగా కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ ఉన్నారు. వీరితో పాటు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను ఏ-4గా ఉన్నాడు. ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులతో కలిపి బిట్టు శ్రీనును విచారించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో బిట్టు శ్రీనును ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.


వామ‌న‌రావు హ‌త్య‌కేసులో ఏ2గా ఉన్న కుంట‌శ్రీనివాస్‌కు వాహ‌నాల‌ను, క‌త్తుల‌ను స‌మ‌కూర్చిన‌ట్లుగా బిట్టు శ్రీను ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. హ‌త్య‌కోణంలో బిట్టుపాత్ర‌పై మ‌రింత స్ప‌ష్ట‌త కోసం విచార‌ణ నిమిత్తం పోలీసులు క‌స్ట‌డీ కోర‌డంతో కోర్టు ప‌రిష్మ‌న్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. పోలీసులు గ‌తంలో చెప్పిన వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం...వామన్ రావు హత్యకు నాలుగు నెలల క్రితమే బిట్టు శ్రీను రెండు ఆయుధాలను తయారు చేయించాడు. ట్రాక్టర్ పట్టీలతో రెండు కత్తులను తయారు చేయించినట్టుగా విచారణలో తాము గుర్తించామని పోలీసు ఉన్న‌తాధికారులు ఇటీవ‌ల తెలిపారు. వామన్ రావును అంతం చేసేందుకు 10 నెలలుగా బిట్టు గ్యాంగ్ ఎదురు చూస్తోందని, మంథని కోర్టు సమీపంలోనే హత్య చేయాలని ప్లాన్ చేశారు.


కానీ అక్కడ సాధ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఇంటి సమీపంలోనే వామన్ రావును హత్య చేయాలనుకొన్నారు కానీ రెండు చోట్ల జనం ఎక్కువగా ఉండడంతో కుంట శ్రీను ప్లాన్ మార్చుకొన్నారని ఐజీ వివరించారు. చివరగా కల్వచర్ల వద్ద వామన్ రావును కుంట శ్రీను , చిరంజీవి సాయంతో హత్య చేశారన్నారు. ఆ త‌ర్వాత నిందితులకు వాహనాలతో పాటు ఆయుధాలను స‌మ‌కూర్చిన‌ బిట్టు శ్రీను.. కుంట శ్రీనుకు ఫోన్ లో.. మీరు మహారాష్ట్రకు వెళ్లిపొండని చెప్పి.. ఇంటి వద్ద ఏం తెలియనట్టు ఉన్నాడ‌ని ఐజీ తెలిపారు. నిందితుల నుంచి ఓ మోటార్ సైకిల్,  ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: