ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అనాలోచితంగా, ఆవేశ‌పూరితంగా ఒక నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ నిర్ణ‌యం రాజ‌కీయంగా దుమారం రేపింది. ప‌లు వివాదాల‌కు కేంద్ర స్థానంగా నిలిచింది. చాలామంది న్యాయ‌స్థానాల గ‌డ‌ప తొక్కారు. అలాగే రాజ్‌భ‌వ‌న్‌, కేంద్రం ఒక‌టేమిటి అందిరి ద‌గ్గ‌ర‌కు ఆ నిర్ణ‌యం వెళ్లింది. తీరా ఇప్పుడు అది అమ‌ల‌వుతుందా?  లేదా? అంటే అమ‌ల‌వ‌ద‌ని బ‌ల్ల‌గుద్ది చెప్ప‌వ‌చ్చు.

ఆ నిర్ణ‌యం ఏమిటంటే శాస‌న‌మండ‌లి ర‌ద్దు వ్య‌వ‌హారం. ఒక ఉప ముఖ్యమంత్రి, మరో మంత్రి రాజీనామాకు దారి తీసిన శాసన మండలి రద్దు నిర్ణయాన్ని వైఎస్ జగన్ ఉపసంహరించుకే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నాయి. ఎందుకంటే ఆ నిర్ణ‌యం ఆయ‌న వెన‌క్కి తీసుకోపోతే ఆయ‌న బ‌లం త‌గ్గిపోతుంది. ఇప్ప‌టికే శాస‌న‌మండ‌లి ర‌ద్దుకు సంబంధించి జ‌గ‌న్ ఒక్క మాట కూడా మాట్లాడ‌టంలేదు. గ‌తంలో ఆవేశంగా చేసిన ప్ర‌క‌ట‌న మిన‌హా ఇప్ప‌టివ‌ర‌కు చ‌ర్య‌లైతే లేవు. క్ర‌మేణా శాస‌న‌మండ‌లిలో వైసీపీ బ‌లం పెరుగుతూ వ‌చ్చింది. కూర్చున్న కొమ్మ‌ను ఎవ‌రూ న‌రుక్కోరు క‌దా! ఎవ‌రూ ‌లాన్ని బ‌ల‌హీన‌త‌గా మార్చుకోరు.

వ‌చ్చే నాలుగు నెలల్లో 24 మంది వైసీపీ సభ్యులు శాసన మండలిలో అడుగు పెట్టబోతోన్నారు. ఇక మున్ముందు ఖాళీ అయ్యే స్థానాలన్నీ దాదాపుగా వైసీపీ ఖాతాలోకే చేరడం ఖాయంగా కనిపిస్తోంది. శాసన మండలిపై పట్టు పెరగబోతోన్నందున దాన్ని రద్దుపై వైఎస్ జగన్ యూటర్న్ తీసుకునే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది.  కడప జిల్లాకు చెందిన సీ రామచంద్రయ్య, అనంతపురానికి చెందిన మహ్మద్ ఇక్బాల్, శ్రీకాకళం జిల్లా నేత దువ్వాడ శ్రీనివాస్, కృష్ణా జిల్లాకు చెందిన పార్టీ నాయకురాలు కరిమున్నీసా, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి చల్లా భగీరథ రెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి ఖరారు చేశారు. పదవిలో ఉండగా మరణించిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి స్థానాన్ని ఆయన కుమారుడు భగీరథ రెడ్డితో భర్తీ చేయనున్నారు. గత ఏడాది కరోనా వల్ల కన్నుమూసిన తిరుపతి లోక్‌సభ సభ్యుడు బల్లి దుర్గా ప్రసాద్ కుమారుడు కల్యాణ్ చక్రవర్తిని మండలికి పంపించనున్నారు.

వచ్చే జూన్ నాటికి మరో 18 శాసన మండలి స్థానాలు ఖాళీ కాబోతోన్నాయి. అవన్నీ వైసీపీకే దక్కడం ఖాయమైనట్టే. మే 24వ తేదీ నాటికి మ‌రో మూడు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతాయి. ఈ మూడూ వైసీపీకే దక్కుతాయి. జూన్ 11వ తేదీ నాటికి మరో నాలుగు ఖాళీలు ఏర్పడతాయి. ఈ నాలుగు కూడా గవర్నర్ కోటాలోనివే. గవర్నర్ కోటా కావ‌డంతో ఒకరిద్ద‌రు రాజ‌కీయేత రంగాల‌కు చెందిన‌వారిని ఎంపిక చేయడానికి అవకాశం ఉంది. అదే నెలలో మరో 11.. అదే నెల 18వ తేదీ నాటికి మరో 11 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. అవి స్థానిక సంస్థల కోటాకు చెందినవి. పంచాయతీ ఎన్నికల్లో నెలకొన్న ఊపు, ఫలితాలను వైసీపీ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పోలింగ్‌లోనూ కొనసాగించగలిగితే.. ఈ 11 కూడా అధికార పార్టీకే చెందుతాయి. ఇప్పుడు కొత్తగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను కూడా కలుపుకొని చూసుకుంటే.. వచ్చే నాలుగు నెలల కాలంలో 24 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాల‌న్నీ త‌మ‌కే ద‌క్కుతాయ‌నే ధీమాలో వైసీపీ నేత‌లున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: