రెండో విడత కరోనా వ్యాక్సిన్‌కి అంతా సిద్ధమైంది. ఈ సారి ప్రైవేట్‌లోనూ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్రం..! ఆర్టీపీసీఆర్‌ కంటే తక్కువ ఖర్చులో వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసుకోవచ్చు..! రెండు డోసులకు 500 రూపాయలుగా నిర్ణయించింది కేంద్రం ప్రభుత్వం. ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రం ఉచితంగానే వ్యాక్సిన్ ఇస్తారు. రెండో విడతలో 27 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు.

రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌కి ముందు కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రైవేట్‌లోనూ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్న డిమాండ్‌ పెరగడంతో.. అందుకు ఓకే చెప్పింది. ప్రైవేటులో ఒక్కో డోసు ధరను రూ.250గా నిర్ణయించింది. ఇందులో టీకా ధరతో పాటు, సర్వీస్‌ ఛార్జి కలిపి ఉన్నాయి. వ్యాక్సిన్‌ ధర రూ.150 కాగా.. సర్వీస్‌ ఛార్జిగా ఒక్కో వ్యక్తి నుంచి 100 రూపాయాలు ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేస్తాయని కేంద్రం తెలిపింది. కరోనా వ్యాక్సిన్‌ను రెండు డోసుల్లో వేసుకోవాల్సి ఉండటంతో.. ఒక్కో వ్యక్తి 500 ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఇది ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కంటే తక్కువే..!

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో మాత్రమే 500 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రులు, వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో ఉచితంగానే వ్యాక్సిన్ ఇస్తారు. ఈ ఖర్చును కేంద్రమే భరిస్తుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు అందాయి. రెండు జాబితాల్లో ఆస్పత్రుల పేర్లను కేంద్రం విడుదల చేసింది.

దేశంలో ఇప్పటికే కరోనా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మార్చి 1 నుంచి రెండో విడతకు సిద్ధమవుతోంది. 60 ఏళ్ల పైబడినవారు, 45-60 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఈ దశలో వ్యాక్సిన్‌ వేయాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరీ ఆలస్యం కాకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రైవేటు ఆస్పత్రులు టీకా వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కేంద్రం కోమార్బిడిటీస్‌ కింద 20 రకాలు వ్యాధులను గుర్తించింది.

కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవాలనుకునేవారు ప్రైవేటు ఆసుపత్రా లేక..ప్రభుత్వాసుపత్రా.. అనేది వారే నిర్ణయించుకోవచ్చని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వానికి చెందిన కొవిన్‌ 2.0 పోర్టల్‌ ద్వారా గానీ, ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా గానీ, వ్యాక్సినేషన్‌ కేంద్రం దగ్గర గానీ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలో ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు మినహాయిస్తే దాదాపు 10వేల ఆస్పత్రుల్లో ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: