ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంటోంది. డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో సీట్ల సర్దుబాట్లపై చర్చలు జరుగుతుండగా.. థర్డ్‌ ఫ్రంట్‌ తెరపైకి వచ్చింది. కమల్‌హాసన్‌, శరత్‌ కుమార్‌ జట్టు కట్టారు. మూడో ఫ్రంట్‌ సీఎం అభ్యర్థిని తానే అంటూ కమల్‌ హాసన్‌ ప్రకటించారు.  

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో.. కమల్‌ హాసన్‌ దూకుడు పెంచారు. ఎన్నికలకు 40 రోజులు మాత్రమే ఉండటంతో.. ఎన్నికల సంగ్రామంలో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యారు. తొలిసారి అదృష్టం పరీక్షించుకోనున్న 'మక్కల్ నీది మయ్యం' ఎన్నికల ప్రచార తేదీని ప్రకటించింది. మార్చి 3న ఎన్నికల ప్రచారానికి తాను శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు కమల్‌హాసన్ . మార్చి 7వ తేదీన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నారు.

తనతో కలిసి వచ్చే వారిని కలుపేసుకుని వెళ్తానని కమల్‌ ప్రకటించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే రజనీకాంత్‌ను కలిసి..తనకు మద్దతు పలకాలని కోరారు. అయితే దీనిపై రజనీ ఇప్పటివరకు ఏం స్పందించలేదు. తాజాగా కమల్‌ ఆలిండియా సముత్వ మక్కల్‌ కట్చీ పార్టీ అధినేత, నటుడు శరత్‌కుమార్‌ను కలిశారు. కమల్‌తో కలిసి నడిచేందుకు శరత్‌ కుమార్‌ అంగీకరించారు. థర్డ్‌ ఫ్రంట్‌ తరపున తానే సీఎం అభ్యర్థిని అని ప్రకటించారు కమల్‌.

2018లో పార్టీని స్థాపించిన కమల్‌ హాసన్‌.. అవినీతి రహిత తమిళనాడే లక్ష్యమంటున్నారు.  234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్‌ 7వ తేదీన ఒకేదశలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కమల్‌ హాసన్‌ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. కమల్‌హాసన్ పార్టీ ఏమేరకు ప్రభావం ఉంటుందో చూడాలి. మొత్తానికి తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. ఎవరికివారు సత్తా చాటాలని పగడ్బంధీ ప్రణాళికలు రచిస్తోంది. చూద్దాం.. ఎవరు ప్రజాభిమోదం పొంది సీఎం సీట్లో కూర్చుంటారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: