ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర‌మోడీ 2014లో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆ త‌ర్వాత కొద్ది నెల‌ల నుంచే ఆయ‌న ఆహార్యం మొత్తం మారిపోయింది. ఆదివారం వ‌చ్చిందంటే చాలు క‌శ్మీర్ కార్య‌క్ర‌మాన్ని షెడ్యూల్‌లో చేర్చేవారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మరే ప్రధాని కూడా అన్నిసార్లు కశ్మీర్ పర్యటించ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. కానీ మోడీ మాత్రం త‌రుచూ వెళ్లేవారు. అక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కొద్ది కాలానికే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు వ‌చ్చాయి.. ఫ‌లితాలు వ‌చ్చాయి.. అంతే. ఆ తర్వాత ఆయన తన అలవాటును మార్చుకున్నారు. కశ్మీర్ వెళ్లటం మానేశారు. ఆ మాటకు వస్తే.. కశ్మీర్ మాత్రమే కాదు.. ఏ రాష్ట్రంలో అయితే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయో.. నోటిఫికేషన్ కు నాలుగైదు నెలల ముందు నుంచి ఆ రాష్ట్ర పర్యటనలు చేప‌డ‌తారు. ఎన్నిక‌లు ముగిసి ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌కానీ న‌రేంద్ర‌మోడీ పర్యటనల మర్మం అర్థమ‌య్యేదికాదు.


ఒక రాష్ట్రంలోఅసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయంటే.. అందరి కంటే ముందుగా మేల్కొనేది ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీనే. మిగిలిన పార్టీల తీరుకు భిన్నంగా వ్యవహరించటం.. అక్కడ పాగా వేసేందుకు అవసరమైన కసరత్తులు చేయ‌డంలాంటివి చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. మన్ కీ బాత్ పేరుతో తన మనసులోని భావాల్ని పంచుకునే ఈ వేదిక మీద తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన 74వ మన్ కీ బాత్ లో ఆయన పలు అంశాల్నిప్రస్తావించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషగా పేరున్న తమిళం నేర్చుకోలేకపోయినందుకు పశ్చాత్తాపాన్నితెలియజేశారు. అందుకు ఎంతో బాధ‌గా ఉంద‌న్నారు. ప్రాచీన భాష అయిన త‌మిళంలో సాహిత్యం ఎంతో అద్భుతంగా ఉంటుందని ప్రశంసించారు. ఎప్పటిలానే మోడీ ఆ మ‌న్‌కీ బాత్‌లో పలు స్ఫూర్తివంతమైన అంశాల్ని ప్రస్తావించారు. ప్ర‌జ‌ల్లో ఉత్తేజాన్ని నింపేప‌నిలో ప‌డ్డారు. పనిలో పనిగా తమిళం గురించి ఆయన మాట్లాడిన మాటలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన వేళ.. తమిళ భాష ప్రస్తావన తీసుకురావటం వ్యూహాత్మకమనే చెప్పాలి. త‌న అమ్ముల‌పొదిలో ఉన్న అస్త్ర‌శ‌స్త్రాల‌న్నీ ఒక్క త‌మిల‌నాడుకే ఉప‌యోగిస్తే ఎలా? ప‌శ్చిమ‌బెంగాల్‌కు కూడా ఉప‌యోగించాల‌ని కాబ‌ట్టి కొంచెం అట్టిపెట్టుకోండి అంటూ ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. త‌మిళ‌భాష నేర్చుకోనందుకు ఎంతో ప‌శ్చాత్తాపాన్ని ప్ర‌ద‌ర్శించిన ఈ త‌మిళ తంబిపై త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు ఎలా స్పందిస్తారో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తేకానీ అర్థ‌మ‌వ‌దు. అప్ప‌టివ‌ర‌కు వేచిచూడాల్సిందే!!

మరింత సమాచారం తెలుసుకోండి: