న్యూఢిల్లీ: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆదివారం ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ51 విజయవంతమైంది. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా కక్ష్యలోకి ప్రవేశించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలోని ఫస్ట్ లాంచింగ్ స్టేషన్ ద్వాదా ఈ రాకెట్‌ను లాంచ్ చేశారు.  ఉదయం 10.24కు ఈ రాకెట్‌ను ప్రయోగించారు. దీని ద్వారా మొత్తం 19 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించారు.

ఈ ప్రయోగం మొత్తాన్ని ఉదయం 9.50 నుంచి దూరదర్శన్‌, ఇస్రో వెబ్‌సైట్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ శివన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానంగా బ్రెజిల్‌ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇస్రో, బ్రెజిల్‌ స్పేస్ ఏజెన్సీలు కలిసి తొలి ప్రయోగం చేయడం ఆనందంగా ఉందన్నారు.

పీఎస్‌ఎల్‌వీ-సీ51 సక్సెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ఇంతటి గొప్ప ప్రయోగాన్ని విజయంవంతంగా పూర్తి చేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు. తొలి కమర్షియల్ లాంచ్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఇస్రో, ఎన్‌ఎస్‌ఐల్‌లను ప్రత్యేకంగా అభినందించారు. అంతరిక్ష సంస్కరణల్లో కొత్తశకం ప్రారంభమైందని, 19 ఉపగ్రహాల ప్రయోగం కొత్త ఆవిష్కరణలకు నిదర్శనమని అన్నారు. దేశంలోని యువత తయారుచేసిన 4 చిన్న ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం గర్వకారణమని, ఇది దేశ యువత గొప్పతనానికి నిదర్శనమని అన్నారు.

ఇదిలా ఉంటే ప్రయోగానంతరం పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్‌ 1.55 గంటలపాటు రోదసిలో పయనించింది. బయలుదేరిన 17.23 నిమిషాలకు బ్రెజిల్‌కు చెందిన 637 కిలోల అమెజోనియ-1 ఉపగ్రహాన్ని సన్‌ సింక్రనైజ్‌ పోలార్‌ ఆర్బిట్‌లోకి చేరవేసింది. అనంతరం 4 నిమిషాలలో మిగిలిన 18 బుల్లి ఉపగ్రహాలను కక్ష్యల్లో వదిలిపెట్టింది. ఇందులోనే సతీశ్ ధావన్ పేరిట తయారైన ఓ ఉపగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. స్పేస్ కిడ్జ్ ఇండియా రూపొందించిన ఉపగ్రహంలో ప్రధాని మోదీ ఫోటోను, భగవద్గీత కాపీని అంతరిక్షంలోకి చేరవేశారు. ఇలా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి ప్రధాని ఫోటో మోదీదే కావడం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: