కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ బీజేపీలో చేరబోతున్నారా.. అంటే కొన్ని రోజులుగా ఆయన కదలికలను గమనిస్తున్న వారంతా నిజమేనని అంటున్నారు. ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా పదవి విరమణ చేసిన ఆజాద్.. కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. శనివారం జమ్మూలో ఆజాద్ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి కాంగ్రెస్ లో జీ23గా పిలువబడుతున్న నేతలు హాజరయ్యారు. గతంలో సోనియాను ధిక్కరిస్తూ బహిరంగ లేఖ రాసిన సీనియర్లు.. ఆజాద్ సమావేశంలో మళ్లీ కలుసుకోవడం కాంగ్రెస్ లో కలకలం రేపింది. అంతేకాదు కాంగ్రెస్ నాయకత్వంపై కొందరు నేతలు ఓపెన్ గానే తమ అసమ్మత్తిని వెళ్లగక్కారు.

కాంగ్రెస్ లో చీలక రానుందా అన్న సంకేతం ఇచ్చిన సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే.. గులాం నబీ ఆజాద్ మరో సంచలనానికి తెర తీశారు. ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తూ ప్రకటన చేశారు.
జమ్మూలో ఓ సభలో ప్రసంగిస్తూ.. తన నేపథ్యాన్ని దాచుకోవాలని మోడీ ఎప్పుడూ ప్రయత్నించలేదని అన్నారు. అనేకమంది నేతలకు సంబంధించిన పలు అంశాలను తాను ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందించానని తెలిపారు ఆజాద్.

తాను పల్లెటూరి నుంచి వచ్చానని..  అందుకు గర్విస్తుంటానని ఆజాద్ పేర్కొన్నారు. మన ప్రధాని మోడీ కూడా గ్రామం నుంచే వచ్చారని చెప్పారు. మోడీ టీ కూడా అమ్మేవారని వివరించారు. తాము రాజకీయ ప్రత్యర్థులమే కావొచ్చు కానీ, తన వ్యక్తిత్వాన్ని దాచుకోని వ్యక్తిగా ప్రధాని మోడీని అభినందించకుండా ఉండలేనని ఆజాద్ స్పష్టం చేశారు. కొందరు గిరిగీసుకుని అందులోనే బతుకుతుంటారని, తమ వాస్తవిక వ్యక్తిత్వాన్ని దాచుకుంటారని వివరించారు.

గత నెలలో  రాజ్యసభలో జరిగిన ఆజాద్ పదవి విరమణ చర్చలో ప్రధాని మోడీ... గులాంనబీ ఆజాద్ ను నిజమైన స్నేహితుడిగా అభివర్ణించారు. ఆయనను తాను రిటైర్ కానివ్వబోనని, ఆయన కోసం తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మోడీ వ్యాఖ్యానించారు. రాజ్యసభలో మోడీ ఆజాద్ ను పొగడటం... జమ్మూ సభలో ప్రధాని మోడీని ఆజాద్ ఆకాశానికెత్తడం చూస్తుంటే ... ఆజాద్ బీజేపీకి దగ్గర అవుతున్నారని తెలుస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే జీ23 నేతలతో కలిసి ఆజాద్ సొంత కుంపటి పెడతారా లేక భారతీయ జనతా పార్టీలో చేరుతారా అన్నది చూడాలి మరీ..

మరింత సమాచారం తెలుసుకోండి: