న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ఆధినాయకత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ అసమ్మతి వ్యక్తంచేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన పార్లమెంట్ సాక్షిగా తన ఎంపీ పదవికి రాజీనామా కూడా చేశారు. అయితే ఆయన తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. జమ్మూ కాశ్మీర్‌లో గుజ్జర్లు ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అజాద్ కూడా ప్రధానిని ప్రశంసించి తమ మధ్య ఉన్న స్నేహాన్ని బయటపెట్టారు. మోదీ చాలా గొప్ప వ్యక్తని, ఏమాత్రం అహంకారం లేని మనిషంటూ ఆజాద్ కొనియాడారు. మోదీని చూసి చాలా నేర్చుకోవచ్చని అన్నారు.

 ప్రధాని అయినప్పటికీ ఆయన మూలాలను ఎప్పడూ మోదీ మర్చిపోలేదని, ఇప్పటికీ తనను తాను చాయ్‌వాలాగానే చెప్పుకుంటారని, అది ఎంతో గొప్ప విషయమని ఆజాద్ అన్నారు. ‘ప్రధాని మోదీతో రాజకీయంగా భిన్న విధానాలున్నా ఆయన విధానాలను మాత్రం కచ్చితంగా అభినందిస్తానను. ప్రధాని హోదాలో ఉన్నప్పటికీ.. గ్రామీణ నేపథ్యాన్ని, చాయ్‌వాలా అని మోదీ చెప్పుకోవడం గొప్ప విషయం. మోదీ తన మూలాల గురించి మర్చిపోకపోవడం గొప్ప విషయం’ అంటూ ప్రధానిని ఆజాద్ అభినందించారు.

ఈ నెల 9న జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో గులాం నబీ ఆజాద్‌కు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ ఆజాద్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఆజాద్‌ లాంటి వ్యక్తి తనకు నిజమైన మిత్రుడని, ఆజాద్‌ సేవలను, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలుమార్లు కన్నీరు పెట్టుకున్నారు. అంతేకాకుండా ఆయనను ఎన్నటికీ పదవీ విరమణ చేయనివ్వబోమని, ఆజాద్‌ సేవలను ఉపయోగించుకుంటామని ప్రధాని మోదీ చెప్పడం కొసమెరుపు.

తాజాగా జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ‘జి-23’గా సదస్సులోనూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఆజాద్ విధానాలనే సమర్థించారు. కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడుతోందని, దాన్ని బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆజాద్‌ అనుభవాలను కాంగ్రెస్‌ పార్టీ సరిగా వినియోగించుకోవడం లేదని విమర్శించారు. ఇక ఇప్పుడు తాజాగా ప్రధాని మోదీపై  సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ మరోసారి ప్రధానమంత్రిని అభినందించడం గమనార్హం. ఇక ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల తీరు పార్టీకి మింగుడుపడని విషయంగానే చెప్పవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: