ప్రధాని మోడీ దేశ ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఎండాకాలం మొదలైంది. ఇక ఇప్పుడు చెరువులు, కుంటలు, వాగులు, జలాశయాలు అన్నీ ఎండిపోతాయి. ఈ సమయంలో వాటిని బాగు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో వాటిని మనం శుభ్రం చేసుకుంటేనే.. వర్షాకాలం వచ్చినప్పుడు నీరు వృధా కాకుండా నిల్వ చేసుకోగలం.. ఈ అంశంపై మోడీ దేశ ప్రజలను హెచ్చరించారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో నీటి సంరక్షణపై దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

అందుకోసం ఆయన ఓ క్యాంపెయిన్‌ కూడా సూచించారు. త్వరలోనే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 'క్యాచ్ ది రెయిన్' ప్రచారానికి శ్రీకారం చుడుతుందని ప్రకటించారు. మాఘమాసంలోనే హరిద్వార్ కుంభమేళా జరుపుకుంటున్నామని, మార్చి 22న నీటి దినోత్సవాన్ని జరుపుకుంటామని ప్రధాని దేశ ప్రజలకు గుర్తు చేశారు. మోడీ మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో సంభాషిస్తారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మన్‌కీ బాత్ ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.

అదే సమయంలో మోడీ.. కొందరు వ్యక్తుల సేవలను గుర్తు చేసుకున్నారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ఎందరో సహకరిస్తున్నారని, బీహార్‌లోని బెట్టియాకు చెందిన ప్రమోద్‌జీ ఇందుకు ఒక ఉదాహరణ అని మోదీ అన్నారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని ఒడిశాలోని అరఖుడ‌కు చెందిన సిలు నాయక్ పేరు ప్రస్తావించారు. నాయక్ సార్‌గా పేరు తెచ్చుకున్న సిలు నాయక్‌ భద్రతా దళాల్లో చేరాలనుకునే యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. దేశానికి సేవ చేయాలనుకుంటున్న ఎందరికో ఆయన మార్గదర్శిగా నిలుస్తున్నారని ప్రధాని అభినందించారు.

ఇక ప్రమోద్‌  జీ.. ఢిల్లీలో ఎల్‌ఈడీ బల్బుల పరిశ్రమలో పనిచేసి.. ఆ తర్వాత సొంతంగా పరిశ్రమ పెట్టుకున్నారని గుర్తు చేశారు ప్రధాని మోడీ. ఆయన తన ప్రసంగంలో తెలంగాణ రైతు చింతల వెంకటరెడ్డిని కూడా గుర్తు చేసుకున్నారు. ఆయన డి విటమిన్ అందించే వరి వంగడాలను అభివృద్ధి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: