పరిషత్ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై హైకోర్టు ఎస్ఈసీని నిలువరించిన సంగతి తెలిసిందే. ఏకగ్రీవం అయిన చోట్ల రిటర్నింగ్ అధికారులు ఫామ్-10 కూడా ఇచ్చిన చోట.. మరోసారి నామినేషన్లు తీసుకోవడం సరికాదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియ ఖరారు కాకుండా ఆగింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో తన విశేష అధికారాలు ఉపయోగించి నామినేషన్ల ప్రక్రియను పునఃప్రారంభిస్తామని అంటున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈమేరకు తన ఆలోచనను మీడియా ముందు ఉంచారు.

ప్రత్యర్థుల బలవంతం  కారణంగా ఎవరైనా మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నా, లేక ప్రత్యేక పరిస్థితుల్లో నామినేషన్లు వేయలేకపోయినా.. అలాంటి వారికి మరో అవకాశం కల్పించే విషయాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ వెల్లడించారు. బాధితుల అభ్యర్థనలపై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారాయన. నామినేషన్లు వేయలేని వారిపట్ల సానుభూతితో వ్యవహరిస్తామని, బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్ కింద మరోసారి అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఉన్న విశేషాధికారాలను మొదటిసారి వినియోగించబోతున్నామని తెలిపారు నిమ్మగడ్డ.

అయితే ఇక్కడే నిమ్మగడ్డకు ఓ అడ్వాంటేజ్ ఉంది. పరిషత్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు పూర్తయ్యాయి కాబట్టి, కోర్టు నిమ్మగడ్డకు బ్రేక్ వేసింది. పురపోరులో ఇంకా నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కాలేదు, అంటే ఏకగ్రీవాలపై అధికారిక ప్రకటన లేదు. దీంతో నిమ్మగడ్డ తన విశేషాధికారాలు ఉపయోగించుకుని పని పూర్తి చేస్తామంటున్నారు. సహజంగానే ఈ నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. మరోసారి నామినేషన్ల ప్రక్రియ మొదలు పెడితే తీవ్ర గందరగోళం ఏర్పడుతుందని అంటున్నారు ఆ పార్టీ  నేతలు. అయితే నామినేషన్లు వేయలేకపోవడానికి బలమైన కారణం, తమతో బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించారని చెప్పడానికి కూడా సాక్ష్యాధారాలు చూపెడితేనే మరో అవకాశం అంటున్నారు నిమ్మగడ్డ. మరి ఎస్ఈసీ విశేషాధికారాలపై ఎవరైనా కోర్టుకెక్కుతారా, లేక ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందా అనే విషయం తేలాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: