దేశవ్యాప్తంగా ఈరోజునుంచి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలవుతోంది. అయితే అధికారులు మాత్రం కండిషన్స్ అప్లై అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల టీకా విషయంలో అప్రమత్తంగా ఉంది. ఎక్కడా ఎలాంటి గందరగోళం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. తొలి వారం పెద్దగా రష్ లేకుండా చేయడానికి వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్యను పరిమితం చేశారు.

తెలంగాణలో మలి విడతలో 50 లక్షల మందికి కరోనా టీకా వేయడానికి ప్రణాళికలు సిద్దం చేశారు అధికారులు. 60 ఏళ్లు పైబడినవారికి, 45-59 ఏళ్ల మధ్య వయసున్నవారిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి తొలిరోజు పరిమిత కేంద్రాల్లో మాత్రమే టీకాలు వేస్తారు. దాదాపు 1,500 కేంద్రాల్లో వేయాలని ముందు నిర్ణయించినా.. ప్రారంభం రోజున ఎటువంటి గందరగోళానికి తావివ్వకూడదనే ఉద్దేశంతో  ఆ సంఖ్యను 93కు తగ్గించారు.

ఆన్ లైన్ లో నమోదు తప్పనిసరి..
ఆన్ ‌లైన్లో నమోదు చేసుకున్నవారిని మాత్రమే తొలివారం వ్యాక్సినేషన్ కు అనుమతిస్తారు. కార్యక్రమం సాఫీగా కొనసాగితే, ఆన్‌ లైన్ ‌లో నమోదు చేసుకోకుండా నేరుగా కేంద్రానికి వచ్చి టీకా వేయించుకునే విషయాన్ని పరిశీలిస్తారు. ఒక్కో కేంద్రంలో గరిష్ఠంగా రోజుకు 200 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి ఉచితంగా వేస్తారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక డోసు ఖరీదు రూ.150, సేవా రుసుం గరిష్ఠంగా రూ.100 వరకూ వసూలు చేసుకోవచ్చు. సేవా రుసుముతో కలిపి వ్యాక్సిన్ ఖరీరు రూ.250కి మించకూడదనే నిబంధన ఉంది. అయితే ప్రైవేటు ఆస్పత్రులు సేవా రుసుముని తగ్గించుకుని, లేదా పూర్తిగా మాఫీ చేసి కేవలం రూ.150కే టీకా వేసే అవకాశం ఉంది.

60 ఏళ్లు దాటిన వారు ఆధార్‌ కార్డు, పాన్ ‌కార్డు, పాస్ ‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటరుకార్డు ఇలా ఏదో ఒక గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ చేయాల్స ఉంటుంది. 45-59 ఏళ్ల మధ్య ఉన్నవారు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా.. వైద్యుడు ఇచ్చిన సర్టిఫికెట్ ని అప్‌లోడ్‌ చేయాలి. టీకా వేయించుకోడానికి వచ్చేటప్పుడు ఆయా సర్టిఫికెట్స్ ఒరిజనల్స్‌ను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. తగిన ధృవపత్రాలు ఉంటేనే టీకా వేస్తామని స్పష్టం చేశారు అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: