మయన్మార్లో ఆందోళన కారులపై ఉక్కుపాదం మోపుతోంది సైన్యం. ఆంగ్‌సాన్‌ సూకీని విడుదల చేయాలంటూ రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వాళ్లపై కాల్పులకు తెగబడుతోంది. వేర్వేరు ప్రాంతాల్లో జుంటా జరిపిన కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

మయన్మార్‌లో ఆందోళన కారులపై తూటా పేలింది. తమ నాయకురాలు ఆంగ్‌సాన్‌  సూకీకి గృహ నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలంటూ యాన్‌గాన్‌ సహా దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. జనం రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. అయితే, ఆందోళనకారులపై టియర్‌ గ్యాస్‌తో పాటు రబ్బర్‌ బులెట్లు ప్రయోగిస్తోంది సైన్యం. ఈ క్రమంలోనే శాంతియుత ప్రదర్శనపై కాల్పులకు తెగబడింది.

ఫిబ్రవరి ఒకటి సైన్యం తిరుగుబాటు చేసి ఆంగ్‌సాన్‌ సూకిని హౌస్‌ అరెస్ట్‌ చేసింది.  ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి... అధికారాన్ని హస్తగతం  చేసుకుంది. అయితే... జుంటా తీరును నిరసిస్తూ లక్షలాది మంది జనం రోడ్లపైకి వచ్చి  నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న సైన్యం కాల్పులకు వెనుకాడడం లేదు. తాజా కాల్పుల్లో ఏడుగురు ఆందోళనకారులు చనిపోయారు. యాన్‌గాన్‌లో ఇద్దరు, దావిలో ముగ్గురు,  మాండ్లేలో ఇద్దరు సైన్యం కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.  20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.  

మయన్మార్‌ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలతో ప్రభుత్వ కార్యకాలపాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా వారాంతాల్లో ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి సైనికుల పాలకులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. టీచర్లు, డాక్టర్లు... అన్ని వర్గాలకు చెందిన వాళ్లు విధులు బహిష్కరించి రోడ్డెక్కుతున్నారు.  

ఆందోళనలు విరమించకపోతే కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే హెచ్చరించారు సైనిక పాలకులు. గత వారాంతం సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ టీజర్‌ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జనం మాత్రం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు.
మొత్తానికి మయన్మార్ తుపాకీ నీడలో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: