ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ కాస్త సీరియస్ గానే దృష్టి సారించింది. తాజాగా ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాల అధికారులు.. రాజకీయ పార్టీలతో సమావేశమయ్యాం అని ఆయన వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి వివక్ష లేకుండా చేపడతాం అని ఆయన అన్నారు. అందరూ సహకరించడం వల్లనే పంచాయతీ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగింది అని తెలిపారు.

మున్సిపల్ ఓటర్లు చైతన్యం కలిగిన వాళ్లూ.. పంచాయతీ ఎన్నికలకంటే ఎక్కువ స్థాయిలో పాల్గొనాలని సూచనలు చేసారు. ప్రతి ఓటరుకు ప్రభుత్వ సిబ్బంది ద్వారానే ఓటర్ స్లిప్పుల పంపిణీకి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వచ్చే నెల ఐదో తేదీలోగా ప్రభుత్వ యంత్రాంగమే ఓటర్ల స్లిప్పుల పంపిణీ చేపట్టాలని ఆదేశం ఇచ్చామని ఆయన తెలిపారు. వలంటీర్లను ఎన్నికల విధుల్లో నిషేధించాం అని అన్నారు. ఎన్నికల విధుల్లో కానీ.. ఎన్నికల్లో కానీ వలంటీర్లు జోక్యం చేసుకుంటే వారిపై క్రిమినల్ చర్యలు నమోదు చేస్తాం అని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ విధుల్లో.. ప్రభుత్వం అప్పగించిన పనిని వలంటీర్లు చేపట్టొచ్చు అని పేర్కొన్నారు. ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో ఐదుగురుకు మించి పాల్గొనకూడదు అని స్పష్టం చేసారు. రోడ్ షోలకు అనుమతిస్తాం అని, డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసామని చెప్పారు. నామినేషన్లు గందరగోళంపై త్వరలోనే వివరాలు అందుతాయి అని ఆయన అన్నారు. బలవంతపు నామినేషన్ల విషయంలో అభ్యర్ధిత్వాల పునరుద్దరణపై బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పరిగణనలోకి తీసుకుంటాం అని ఆయన వివరించారు. పరిమితులకు లోబడి న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం అని వివరించారు. త్వరలోనే నామినేషన్ల పునరుద్దరణపై నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. నామినేషన్లు వేయలేకపోయిన వారికి..  స్క్రూట్నీలో పోయిన వారికి తిరిగి నామినేషన్లు వేసుకునే అవకాశం ఇవ్వడం సాధ్యం కాదు అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: