ఆంధ్రప్రదేశ్ లో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాలంటీర్లను ఉపయోగించకూడదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేక మార్లు ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు. అయితే అయినా వినకుండా ప్రభుత్వం వాలంటీర్లను ఉపయోగిస్తూ ఉండడంతో నిన్న పొద్దుపోయాక ఆయన సంచలన ఆదేశాలు జారీ చేశారు. నిన్న తిరుపతి పర్యటనకు వెళ్లిన ఆయన మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్ల సేవల వినియోగం  ఏ మాత్రం ఉండకూడదు అని స్పష్టం చేశారు. అంతేకాక ఎన్నికల పూర్తయ్యేవరకు వాలంటీర్ల కదలికల మీద కూడా దృష్టి పెట్టనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. 

వాలంటీర్ల సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో పాటు వారి సెల్ ఫోన్ లో  డేటా దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశించినట్లు చెబుతున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల సమయంలో వాలంటీర్ల పాత్ర మీద చాలా అనుమానాలు తలెత్తాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఒకపక్క ఆయన చేసిన ప్రకటన అలా ఉండగానే అనంతపురం జిల్లాలో వాలంటీర్లు ప్రచార పర్వానికి తెర లేపడం సంచలనంగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించి బాధ్యతను క్షేత్రస్థాయిలో వాలంటీర్లు భుజాని కెత్తుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రతి గడపను తడుతూ వైసీపీని గెలిపిస్తేనే మీకు పథకాలు ఉంటాయని లేకుంటే పథకాలు లభించవని చెబుతూ ఆందోళనకు గురి చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అనంతపురం కార్పొరేషన్ విషయానికి వస్తే మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంలో భాగంగా అధికార పార్టీ నేతలు ప్రత్యర్థులు బలంగా ఉన్నారని భావిస్తున్న కొన్ని కీలక డివిజన్లలో వాలంటీర్లను భారీగా మోహరించినట్లు ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా అనంతపురం కార్పొరేషన్ లో 48వ డివిజన్ లో వాలంటీర్ల అభ్యర్థి తరఫున ఎన్నికల నిర్వహిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: