కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎవ‌రి సూచ‌న‌ల మేరకు కేర‌ళ‌, త‌మిళ‌నాడు, పుదుచ్చేరిలో ఒకే విడ‌త‌లో ఎన్నిక‌ల షెడ్యూల్ రూపొందించిందో, ప‌శ్చిమ బెంగాల్‌కు 8 విడ‌త‌లుగా షెడ్యూల్ రూపొందించిందో అంద‌రికీ తెలిసిందే. బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్‌, భార‌తీయ జ‌న‌తాపార్టీ మ‌ధ్య  హోరాహోరీ పోరు న‌డిచే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే ఏబీపీ, సీవోట‌ర్ నిర్వ‌హించిన స‌ర్వేలో ప‌శ్చిమ బెంగాల్‌ను దీదీ మ‌మ‌తాబెన‌ర్జీయే మ‌ళ్లీ కైవ‌సం చేసుకుంటుంద‌ని తేలింది.

బెంగాల్‌లో దీదీకే ప్రజలు ఓటు వేయ‌నున్నారు. తమిళనాడులో డీఎంకేదే హ‌వా కొన‌సాగ‌నుంది. అన్నాడీఎంకేను బెదిరించో, బామాలో భార‌తీయ జ‌న‌తాపార్టీ చేస్తున్న రాజ‌కీయానికి అక్క‌డి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు లేదు. అలాగే కేర‌ళ‌లో వామ‌ప‌క్ష కూట‌మి త‌న అధికారాన్ని నిల‌బెట్టుకోనుది. అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే అధికారంలోకి రాబోతోంది. పుదుచ్చేరిలో కూడా బీజేపీయే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నాయి. ఎన్నికల నగారా మోగిన తర్వాత ఏబీపీ సీ-ఓటర్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో పై విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.

పశ్చిమబెంగాల్‌: మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ 148 నుంచి 164 సీట్లు సాధించి మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తేలింది.  బీజేపీకి 92 నుంచి 108 సీట్ల దాకా వచ్చే అవకాశం ఉంది.  కాంగ్రె్‌స-వామపక్ష కూటమికి 31-39 సీట్లు వచ్చే అవకాశం ఉన్న‌ట్లు ఏబీపీ, సీవోట‌ర్ తెలిపింది.

తమిళనాడు:  అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గట్టి దెబ్బ తగలబోతోందని ఏబీపీ సీ-ఓటర్‌ సర్వేలో తేలింది. అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి 58-66 సీట్లు వచ్చే అవకాశం ఉంది. డీఎంకే నేతృత్వంలోని యూపీఏ కూటమికి 154-162 సీట్లు రావొచ్చు. కమల్‌ పార్టీకి (మక్కల్‌ నీది మయ్యమ్‌) 2-6 సీట్లు వచ్చే అవకాశం ఉన్న‌ట్లు ఓపీనియ‌న్ పోల్‌లో వెల్ల‌డైంది.

కేరళ:  కేరళలో వామపక్ష కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌కు (ఎల్‌డీఎఫ్‌) 83 నుంచి 91 సీట్లు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ 47-55 సీట్లు,  బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది.

అసోం : అసోంలో ఎన్డీయే కూటమి 43 శాతం ఓట్లతో అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది.  బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి  72సీట్లు వస్తాయని తేలింది.  కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీయే కూటమి 47 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది.

పుదుచ్చేరి: పుదుచ్చేరిలో ఈసారి కాంగ్రె్‌సకు గట్టి దెబ్బ తగలబోతోంది. 17 నుంచి 21 సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ ఈసారి 12లోపు సీట్లకే పరిమితమయ్యే అవకాశం క‌న‌ప‌డుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: