ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రచార వేడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా వైసీపీకి రెబెల్స్ బెడద ఎక్కువగా ఉంది. అనంతపురం జిల్లా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే అధికార పార్టీకి ఏకంగా 12 డివిజన్ లలో కొరకరాని కొయ్యగా మారారు. నిజానికి ఎల్లుండితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. దీంతో ఇప్పుడు ఈ పన్నెండు డివిజన్లలో రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వాళ్ళు వెనక్కి తీసుకుంటారా లేదా అనే దాని మీద ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. రెబల్స్ తో తలనొప్పి ఎందుకు అని భావిస్తున్న అధికార వైసీపీ అలాగే ప్రతిపక్ష టీడీపీ ఇంకా అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా ప్రకటించ లేదు. 


అనంతపురం కార్పోరేషన్ లో మొత్తం 50 డివిజన్లలో ఎన్నికలు జరుగుతుండగా టిడిపి నుంచి ఇప్పటికే 45 మంది పేర్ల దాకా అధికారికంగా వినిపిస్తున్నాయి. కానీ వైసీపీలో ఆ పరిస్థితి లేదు కేవలం 30 మంది పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపించే పరిస్థితి ఏర్పడింది. అయితే వైసీపీకి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి రెబల్స్ బెడద ఎక్కువగా ఉన్నా రెండు మూడు రోజుల నుంచి పార్టీ పెద్దలు రెబల్స్ తో మాట్లాడుతూ నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేసేందుకు గాను వాళ్ళని సమాయత్త పరుస్తున్నారు. కానీ 12 డివిజన్లలో మాత్రం ఎవరు వెనక్కి తగ్గని పరిస్థితి నెలకొంది. 


అయితే అధికార వైసీపీ అభ్యర్థుల తుది జాబితా ఇంకా వెలువడక పోవడంతో ఎప్పుడు వస్తుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. నిజానికి నిన్న సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరిగినా  అది మాత్రం నోచుకోలేదు. ఈరోజు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ అనంతపురం వెళ్ళనున్నారు. ఈరోజు గుత్తి రోడ్డులో ఉన్న ఫంక్షన్ హాల్ లో వాళ్ళు కార్పొరేషన్, మున్సిపాలిటీల నేతలతో విడివిడిగా సమావేశమవనున్నారు. ఈ సమావేశం అనంతరం తుది జాబితా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. అలాగే ఆ పన్నెండు డివిజన్ లలో రెబల్ అభ్యర్థులను వారు బుజ్జగించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: