టిక్‌ టాక్‌ స్టార్‌తో పరిచయం.. ఏకంగా ఓ మంత్రి రాజీనామాకు దారి తీసింది. మహారాష్ట్రలో టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. క్రమంగా ఈ వ్యవహారం శివసేన ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది. అందుకే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆదేశాల మేరకు మహారాష్ట్ర అటవీ  మంత్రి సంజయ్‌ రాథోడ్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు అందజేశారు.


అసలు ఆ మహిళ ఎవరు.. ఆ మహిళకు మంత్రి సంజయ్ రాధోడ్ కూ సంబంధం ఏంటి.. మంత్రి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది... తెలుసుకుందాం.. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాకు చెందిన పూజా చవాన్‌ ఓ టిక్ టాక్‌ స్టార్‌.. ఓ మోడల్ కూడా. అయితే 23 ఏళ్ల పూజా చవాన్‌  ఫిబ్రవరి 8న పుణేలో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆమెకు మంత్రి సంజయ్ రాధోడ్‌తో పరిచయం ఉంది.


గతంలో ఆమె మంత్రితోనూ సన్నిహితంగా ఉన్న వీడియోలు కూడా లభించాయి. ఇప్పుడు పూజా చవాన్ ఆత్మహత్య నేపథ్యంలో మంత్రి సంజయ్‌ రాథోడ్‌ పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అవకాశాన్ని బీజేపీ బాగా వాడుకుంది. సంజయ్‌ వేధింపుల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు ఆందోళనలు ఉధృతం చేశారు. పూజా చవాన్‌తో మంత్రి ఉన్నట్లు, మాట్లాడినట్లుగా చెబుతున్న ఫొటోలు, వీడియోలు, ఆడియో క్లిప్‌లు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


క్రమంగా ఈ వ్యవహారం శివసేన సర్కారు మెడకు చుట్టుకుంటోందని గ్రహించిన ఉద్ధవ్‌ ఠాక్రే.. తన మంత్రి సంజయ్ రాధోడ్‌తో రాజీనామా చేయించారు. శివసేన ఆధ్వర్యంలోని  మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో రాజీనామా చేసిన తొలిమంత్రిగా  సంజయ్‌ రాథోడ్‌ నిలిచారు రాష్ట్రంలో ఓ మహిళ మరణానికి సంజయ్‌ రాథోడ్‌ కారణమని ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండడంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే రాజీనామా చేసినా తాను నిర్దోషినే అంటున్నారు సంజయ్ రాథోడ్. పూజా చవాన్ మరణంపై బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: