ప్రధాని నరేంద్ర మోదీ రెండోవిడ‌త  కరోనా టీకా పంపిణీలో వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా  ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకా ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని మోదీ తొలి డోసు టీకాను తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. ఎయిమ్స్‌లో కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నాను. ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి మన వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషి చెప్పుకోదగినది.


టీకా తీసుకోవడానికి అర్హత ఉన్నవారందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మనమంతా కలిసి కరోనా రహిత దేశాన్ని నిర్మిద్దాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఎలాంటి అపోహలు లేకుండా ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, కరోనా వ్యాక్సిన్ పట్ల అపోహలు, అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని వ్యాక్సిన్ వేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఇదిలా ఉండ‌గా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, 60 ఏళ్ల వృద్ధులకు టీకాల పంపిణీ దేశ వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగానే లభించనుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం సర్వీసు చార్జి రూ.100తో కలిపి రూ.250లకే లభించనుంది.


తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 48 ప్రభుత్వ ఆసుపత్రుల్లో, 45 ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ కేంద్రాలను నెలకొల్పినట్లు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దేశంలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్య ఆరోగ్య‌శాఖ చెబుతోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసే దిశగా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కుధరించడం, ఫిజికల్ డిస్టెన్స్‌ వంటి కొవిడ్‌ నియంత్రణ రూల్స్‌ను పక్కాగా అమలు చేయాలని సూచించింది. ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నిర్లక్ష్యానికి ఏమాత్రం తావివ్వకూడదని హితవు పలికింది.

మరింత సమాచారం తెలుసుకోండి: