తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..  వారం రోజుల వ్య‌వ‌ధిలో రెండోసారి త‌న సొంత జిల్లా చిత్తూరులో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయితీ ఎన్నిక‌ల్లో వైసీపీ మ‌ద్ద‌తుదారులు ఎక్క‌వ స్థానాలు గెలుచుకున్నారంటూ ప్ర‌చారం హోరెత్త‌డంతో వాస్త‌వ ప‌రిస్థితిని తెలుసుకోవ‌డానికి క్షేత్ర‌స్థాయిలో బాబు ప‌ర్య‌టించారు. ఈసారి పుర‌పాల‌క సంఘ ఎన్నిక‌ల‌ను ప‌ర్య‌వేక్షించ‌నున్నారు.  పార్టీ అభ్య‌ర్థుల‌ను నామినేష‌న్లు వేయ‌కుండా అడ్డుకుంటున్న వైసీపీ నేత‌ల తీరుకు నిర‌స‌న‌గా ధ‌ర్నా చేప‌ట్ట‌నున్నారు.

పుర‌పాల‌క సంఘ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల‌ను నామినేషన్లను దాఖలు చేయనివ్వకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారనే కారణంతో చంద్ర‌బాబు ధర్నాలు, ఆందోళనలు చేయనున్నారు. ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు, మరోవైపు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చిత్తూరు జిల్లా రాజకీయాలపై దృష్టి పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో టీడీపీ తరఫున కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. కుప్పం పర్యటనను ముగించుకున్న అనంతరం చంద్రబాబు హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడే ఉంటున్నారు. ఈ ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో చిత్తూరుకు చేరుకొని  జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తారు.

చిత్తూరు పుర‌పాల‌క సంఘ  ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారనే కారణంపై ఆయన ఈ ధర్నా చేయనున్నారు.  ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది. అనంతరం తిరుపతికి వెళ్లి సాయంత్రం 5.45 నిమిషాలకు గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. ధర్నా ముగిసిన తరువాత తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయానికి వెళ్తారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై అనుస‌రించాల్సిన వ్యూహాల‌ను చ‌ర్చించ‌నున్నారు. పనబాక లక్ష్మి సహా ఇతర సీనియర్ నేతలకు దిశానిర్దేశం చేసిన అనంత‌రం చంద్ర‌బాబునాయుడు తిరుపతి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: