మింగ మెతుకు లేదు.. మీసాల‌కు సంపెంగ నూనె

భార‌త‌దేశంలో పెట్రోలు ధ‌ర‌లు లీట‌రు రూ.100కు చేరుకున్నాయి. మున్ముందు ఎంత ధ‌ర‌కు చేరుకుంటాయో తెలియ‌ని ప‌రిస్థితి. ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌నే ఆలోచ‌న న‌రేంద్ర‌మోడీ ఆధ్వ‌ర్యంలోని కేంద్ర ప్ర‌భుత్వానికి ఏ కోశానా క‌న‌ప‌డుతున్న దాఖ‌లాలు లేవు. దీనికితోడు వంట‌గ్యాస్ ధ‌ర‌ల‌ను కూడా పెంచారు. ఎల్పీజీ రాయితీ కింద బ్యాంకులో నాలుగు రూపాయ‌లు వేస్తున్నారు. అది కూడా ముష్టి వేసిన‌ట్లు వేస్తున్నార‌ని వినియోగ‌దారులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుద‌ల ప్ర‌భావం అన్ని వ‌స్తువుల‌పై ప‌డుతుంద‌నే విష‌యం పాల‌కుల‌కు తెలుసు. అయినా వారికి ధ‌ర‌ల‌ను అదుపుచేసే ఆలోచ‌న లేదు. త‌గ్గించ‌రు కూడా. వారికి కావ‌ల్సింది ఒక్క‌టే. రాజ‌కీయ ఆధిప‌త్యం. ప్ర‌జ‌లెలా పోయినా మ‌న‌కెందుకు అనే ధోర‌ణి. ఆ ప్ర‌జ‌లు బాగుంటేనే వ్య‌వ‌స్థ బాగుంటుంద‌నే విష‌యం తెలియ‌ని చిన్న‌పిల్ల‌లేంకాదు వారు. కానీ దేశంలో ఉన్న‌ధ‌నాన్నే గుప్పిట్లో పెట్టుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న రాజ‌కీయ నేత‌లు వారు.

ఎటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితులెదురైనా దేశ ప్ర‌జ‌ల సౌభాగ్యం కోస‌మే తాను కృషి చేస్తుంటాన‌ని, ఉద‌యం నాలుగు గంట‌ల‌కే లేచి ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఏయే కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌నే అంశంపై త‌న ఆలోచ‌న‌లు కొన‌సాగుతాయ‌ని, దీనికి సంబంధించి అంద‌రితో చ‌ర్చిస్తుంటాన‌ని ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌తిరోజు ఎక్క‌డ ఏ స‌మావేశం పెట్టినా, ఏ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నా పై విష‌యాల‌న్నీ ఏక‌రువు పెడుతుంటారు. వాస్త‌వ‌మేంటో తెలిసినా, తెలియ‌క‌పోయినా మ‌న‌కు మాత్రం విన‌క‌త‌ప్ప‌డంలేదు. ఎందుకంటే ప్ర‌సార మాధ్య‌మాల ద్వారా ఆ విష‌యాల‌న్నీ మ‌న‌కు తెలుస్తుంటాయి కాబ‌ట్టి. ఆయ‌న కూడా ప్ర‌ధాన‌మంత్రి కాబ‌ట్టి మ‌న సంక్షేమం కోసం, మ‌న ఆర్థిక సౌభాగ్యం కోసం ఏయే నిర్ణ‌యాలు తీసుకుంటున్నారో అనే చిన్న ఆశ ఉంటుంది కాబ‌ట్టి.

వాస్త‌వ ప‌రిస్థితులు ప‌రిశీలిస్తే, క్షేత్ర స్థాయిలో ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాలు మ‌న‌కు అవ‌గ‌త‌మైతే మ‌న‌కు ఎటువంటి ఆశ‌లు క‌ల‌గ‌వు. క‌రోనా త‌ర్వాత ఆర్థిక వ్య‌వ‌స్త కుదేలైంది. ఉద్యోగాలు పోయాయి. అంద‌రూ రోడ్డున ప‌డ్డారు. బ‌తికుంటే బ‌లుసాకు తినొచ్చ‌నే ధోర‌ని ఎంతోమంది ఉద్యోగులు, కూలీలు, ఇత‌రులు త‌మ త‌మ సొంత ప్రాంతాల‌కు వ‌ల‌స వెళ్లారు. ఈ వ‌ల‌స వెళ్లే క్ర‌మంలో ఆక‌లిబాధ‌కు త‌ట్టుకోలేక‌.. న‌డిచి .. న‌డిచి ఎంతోమంది ప్రాణాలు కోల్పోవ‌డ‌మ‌నేది మ‌న భార‌త‌దేవ చ‌రిత్ర‌లోనే నిలిచిపోయే అత్యంత దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట్టం. అయినా కూడా కేంద్రంలో చ‌ల‌నం లేదు. ప్ర‌జ‌ల సంక్షేమానికి చ‌ర్య‌లు తీసుకోకుండా ఎన్నిక‌లు జ‌రుగుతున్న రాష్ట్రాల్లో ప్ర‌చారం చేస్తూ వారికి సౌక‌ర్యాల క‌ల్ప‌న కోసం వేల‌కోట్ల రూపాయ‌ల వాగ్దానాలు చేస్తున్నారు. అవ‌న్నీ వ‌స్తాయా?  రావా? అనేది ఎన్నిక‌ల త‌ర్వాత మ‌న‌కు తెలుసు.. వారికి తెలుసు. ఇప్పుడున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బాగుచేసి ప్ర‌జ‌ల ఆదాయం పెంచే మార్గాలు చూడ‌కుండా ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం కోసం రూ.వేల కోట్ల వ‌రాలు గుప్పించ‌డంవ‌ల్ల ఉప‌యోగం ఏముంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. మింగ మెతుకు లేదుకానీ మీసాల‌కు సంపెంగ‌నూనె అనే ధోర‌ణిలో కేంద్ర ప్ర‌భుత్వ తీరు ఉంటోంద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.









మరింత సమాచారం తెలుసుకోండి: