ఎన్నికల్లో గెలుపు తరువాత వస్తుంది. దాని కంటే ముందు ధీమా రావాలి. కావాలి. ఆ విధంగా చూసుకుంటే మాత్రం విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లో అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం రాజకీయంగా ఎలా ఉన్నాయి. వాటి బలాలూ బలహీనతలు ఏంటి అన్నది ఒక విశ్లేషణ.

విశాఖ అంటేనే తెలుగుదేశానికి కంచుకోట. ఎక్కడా టీడీపీ గెలవకపోయినా విశాఖలో గెలిచి తీరుతుంది. అది ఇప్పటిదాకా రుజువు అయిన విషయం. 2019 ఎన్నికల వేళ విశాఖ సిటీలో నాలుగు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ గెలిచి పార్టీ పరువు నిలబెట్టింది. అటువంటి చోట ఇపుడు పరిస్థితి ఎలా ఉంది అని కనుక ఆలోచిస్తే బయట నుంచి వచ్చిన నాయకుల సారధ్యం తప్ప లోకల్ లీడర్స్ పెద్దల లేని పరిస్థితి. విశాఖ జిల్లా పార్టీ ఇంచార్జి నిమ్మకాయల చినరాజప్ప పార్టీని పర్యవేక్షిస్తున్నారు.

అదే విధంగా మరో నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా పాలు పంచుకుంటున్నారు. ఇక లోకల్ గా ఉన్న బలమైన నేతలు అంతా వైసీపీ కండువాను కప్పుకుని జారుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల బలం అంతా అధికార వైసీపీలో కనిపిస్తోంది. మరో విషయం ఏంటి అంటే వైసీపీకి మంత్రి, ఎంపీలతో పాటు, విజయసాయిరెడ్డి సారధ్యం పెద్ద అసెట్ గా ఉంది.

ఆయన రోజుకు నాలుగైదు వాడులను సులువుగా చుట్టేస్తున్నారు. ప్రచారాన్ని పీక్స్ తీసుకెళ్ళిపోయారు. పార్టీలో ఎక్కడ సమస్య వచ్చినా ఆయనే పరిష్కరిస్తున్నారు. దాంతో వైసీపీ అభ్యర్ధుల జాబితా కూడా పూర్తిగా రిలీజ్ అయిపోయింది. అదే సమయంలో టీడీపీలో ఇంకా జాబితా విడుదల కాకపోవడం విశేషం. ఈ రోజు విడుదల చేస్తారని టాక్. అంతా చంద్రబాబు కనుసన్ననలో జరగాలి. ఆయన జాబితాను ఓకే చేస్తే తప్ప రిలీజ్ చేయలేని పరిస్థితి. ఈ నేపధ్యంలో ప్రచారంలో పరుగులు పెడుతున్న వారు వైసీపీ నేతలు అయితే టీడీపీలో ఇంకా మొదటి దశను దాటలేదు. ఇలాంటి వీక్ నెస్ ల వల్లనే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఎవరు అసలైన వీక్, జనాలు ఎవరికి షాక్ ఇస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: