అదేంటి గాలి ఇద్దరి ప్రాణాలు ఎలా తీస్తుంది అని ఆశ్చర్యపోతున్నారా ? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ట్రాక్టర్ టైర్ కు మోతాదుకు మించి గాలి నింపడంతో అది పేలిపోయి ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన శ్రీకాకుళం జిల్లా కొమ్మనాపల్లి వద్ద చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే తిమడం గ్రామానికి చెందిన గోవిందరావు అనే వ్యక్తికి సంబంధించిన ట్రాక్టర్ టైరు పంచర్ అయింది. దీంతో కొమ్మనాపల్లిలో ఉన్న సూర్యనారాయణ అనే వ్యక్తికి సంబంధించిన పంచర్ షాప్ వద్దకు వచ్చి పంచర్ వేయించుకున్నాడు. 

అయితే పంచర్ వేసిన అనంతరం పంచర్ వేసి గాలి ఎక్కిస్తుండగా  ఇద్దరూ దాన్ని పట్టించుకోలేదు. మోతాదుకు మించి గాలి పట్టడంతో అది ఒక్కసారిగా పేలి పోయింది. టైర్ కు చాలా దగ్గరలో ఉన్న వీళ్లిద్దరూ టైర్ డిస్క్ తో సహా 20 అడుగుల ఎత్తుకు ఎగిరి విద్యుత్ తీగలు తగలడంతో సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా గోవిందరావు తీవ్రంగా గాయాలపాలయ్యారు. 

దీంతో 108కి కాల్ చేసి గోవిందరావుని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించాక ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిజానికి టైర్లలో ఎంత గాలి నింపాలి అనే దానికి ఒక కొలమానం ఉంటుంది. దానికి మించి గాలి పట్టిస్తే గనుక చిన్న రాయి లాంటిది తగిలినా పేలిపోయే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద గాలి ఎక్కువ అయి టైర్లు పేలిపోయిన ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: