తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌కు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల‌క‌న్నా భార‌తీయ జ‌న‌తాపార్టీ  దాని మిత్ర‌ప‌క్షం జ‌న‌సేన మ‌ధ్య భిన్న‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంది. తిరుపతి ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలనేది ఇంకా తేలలేదు. ఏ పార్టీ నుంచి అభ్యర్థిని బరిలోకి దింపాలనేది కూడా ఖరారు కాలేదు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. బీజేపీ ఈ ఉప ఎన్నిక బరిలో దిగడం దాదాపు ఖాయమైనట్టే. తిరుపతి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ నాయకులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేప‌డుతున్నారు. ఆయా ప్రాంతాల్లో బలమైన సామాజిక వర్గ నేతలతో భేటీ అవుతున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవ‌ల జ‌రిగిన పంచాయితీ ఎన్నిక‌ల్లో రాష్ట్రం మొత్తం కూడా భార‌తీయ జ‌న‌తాపార్టీ క‌నీసం 50 పంచాయితీల‌ను కూడా గెలుచుకోలేక‌పోయింది. అంతేకాకుండా క‌నీసం ద్వితీయ స్థానంలో కూడా నిల‌బ‌డ‌లేక‌పోయింది. ఏపీలో ఆ పార్టీని ప్ర‌జ‌లు ఆద‌రించే ప‌రిస్థితి ఏ కోశానా క‌న‌ప‌డ‌టంలేదు. నామ‌మాత్ర‌పు ఓటింగ్ కూడా లేని బీజేపీతో పొత్తుకు వెళ్ల‌డంవ‌ల్ల న‌ష్ట‌పోతామేకానీ ఎటువంటి ప్ర‌యోజ‌నం ద‌క్క‌ద‌ని జ‌న‌సేన నేత‌లు ప‌వ‌న్‌కు చెబుతున్నారు. దీనిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లు స‌మాచారం.

తిరుపతి ఉప ఎన్నిక వ్యవహారంలో పవన్ కల్యాణ్‌కు బీజేపీ నుంచి ఎలాంటి భరోసా లభించట్లేదు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోనూ పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు గానీ భరోసా రాలేదు. ఫలితంగా- ఎవరు పోటీ చేయాలనే విషయంపై గందరగోళం నెల‌కొంది. 4న తిరుపతికి అమిత్ షా రాబోతోన్నారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పర్యటిస్తోన్నారు. 4న‌ తిరుమల శ్రీవారిని దర్శించుకొని పార్టీ నేత‌ల‌తో భేటీ అవ‌నున్నారు. బహిరంగ సభలోనూ పాల్గొనే అవకాశాలున్నాయ‌ని, అయితే దీనిపై ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు.

అదే రోజు పవన్ కల్యాణ్ కూడా తిరుపతికి బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. అభ్యర్థిని పోటీకి నిలిపే విషయంపై పవన్ కల్యాణ్.. అమిత్ షాతో తాడోపేడో తేల్చుకుంటారని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నందున.. దానికి బ‌దులుగా తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని ఆయన అమిత్ షాకు విజ్ఞప్తి చేయ‌నున్నారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేనతో మద్దతుతో పోటీ చేసిన బహుజన్ సమాజ్‌వాది పార్టీ అభ్యర్థికి పోలైన ఓట్ల శాతాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్తారని సమాచారం. తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో జనసేన అభ్యర్థిని నిల‌బెట్ట‌డంపై  అమిత్ షా ఎలాంటి హామీ ఇవ్వకపోతే.. జ‌న‌సేనాని కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకునే అవకాశాలు లేకపోలేదని రాజ‌కీయ‌వ‌ర్గాల స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: