అమిత్ షా తిరుపతి టూర్ రద్దు అయింది. ఈ నెల నాలుగున తిరుపతిలో ఆయన టూర్ ఉంది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన తిరుపతి లో సమవేశం నిర్వహించాల్సి ఉంది. అయితే సడెన్ గా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి పడింది. దాంతో పాటు ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చింది. ఈ క్రమలో అమిత్ షా టూర్ రద్దు అన్నది అధికార వర్గాల సమాచారం.

ఇదిలా ఉంటే అమిత్ షా తిరుపతి రాకపోవడంతో ఆయనతో భేటీ అయి ఏదో విధంగా తిరుపతి పంచాయతీని తేల్చాలని భావిస్తున్న జనసేనకు గట్టి షాక్ తగిలింది అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతి సీటుని తాము వదులుకోమని జనసేన అంటోంది. తమకే సీటు కేటాయించాలని కూడా పట్టుపడుతోంది. మరో వైపు బీజేపీ కూడా ఈ సీటు మీద కన్నేసింది.

ఇక్కడ బీజేపీకి 1999 ఎన్నికల్లో గెలిచిన ఒక హిస్టరీ ఉంది. అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగానే బీజేపీ గెలవగలిగింది. సొంతంగా 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే పదహారు వేల ఓట్లు మాత్రమే ఆ పార్టీకి వచ్చాయి. ఇక జనసేన పెట్టాక ఎపుడూ ఇక్కడ పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో  ఇక్కడ పొత్తులలో భాగంగా బీఎస్పీకి ఈ సీటు కేటాయించింది. ఆ పార్టీకి 20 వేల దాకా ఓట్లు వచ్చాయి.

అయితే తిరుపతిలో చిరంజీవి 2009 ఎన్నికల్లో గెలిచిన సెంటిమెంట్, పవన్ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో తిరుపతి టికెట్ కోరుతున్నారు. కానీ బీజేపీ మాత్రం ఎంపీ సీట్లలో పోటీని ఒక జాతీయ పార్టీగా వదులుకోవడానికి సిధ్ధంగా లేదు. దీంతో అతి పెద్ద పీటముడి పడిపోయింది. అమిత్ షా వచ్చి ఈ తగవు తీరుస్తారు అనుకుంటే ఆయన టూర్ క్యాన్సిల్ అయింది. మరో వైపు చూస్తే టీడీపీ, వైసీపీ తమ అభ్యర్ధులను  దాదాపుగా ఖరారు చేసేశాయి. వచ్చే నెలలో ఉప‌ ఎన్నిక జరిగే ఛాన్స్ ఉంది. మరి ఇప్పటికీ అభ్యర్ధిని ప్రకటించి ప్రచారానికి వెళ్లకపోతే టూ లేట్ అవుతుంది అని కూటమి నేతలు కంగారు పడుతున్నారుట.

మరింత సమాచారం తెలుసుకోండి: