నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో దేశ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా బీజేపీ, టీఎంసీ మధ్య  యుద్ధంలా సాగుతున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెంగాల్ లో మమతతో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా వార్తల్లో ఉన్నారు. బెంగాల్ లో బీజేపీకి డబుల్ డిజిట్ కూడా రాదని ప్రకటించి కాక రాజేశారు పీకే. ఆయన వ్యాఖ్యలపై కమలనాధులు భగ్గుమంటున్నారు.

బెంగాల్ ఎన్నికల్లో కీలకంగా మారిన ప్రశాంత్ కిశోర్ కు సడెన్ గా ప్రమోషన్ దక్కింది . ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక బాధ్యతలను అప్పగించారు. తన ప్రధాన సలహాదారుడిగా ఆయనను నియమించారు. నాలుగేళ్ల క్రితం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించేందుకు ప్రశాంత్ కిశోర్ తన వంతు ప్రయత్నం చేశారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మరోసారి పంజాబ్ లో తన వ్యూహాలను అమలు చేయబోతున్నారు.

తన ప్రధాన సలహాదారుడిగా ప్రశాంత్ కిశోర్ ను నియమించినట్టు తెలియజేయడానికి తనకు ఎంతో సంతోషంగా ఉందని  అమరీందర్ సింగ్ తెలిపారు. పంజాబ్ ప్రజల అభివృద్ధి కోసం ప్రశాంత్ తో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పారు. ప్రశాంత్ కిశోర్ నియామకానికి పంజాబ్ కేబినెట్ ఆమోదముద్ర వేసిందని సీఎంఓ కార్యాలయంప్రకటించింది. ఆయనకు కేబినెట్ హోదా ఉంటుందని తెలిపింది.పంజాబ్ సర్కార్ నిర్ణయంపై స్పందించిన ప్రశాంత్ కిశోర్.. ఈ అంశం గత ఏడాదిగా టేబుల్ పై ఉందని అన్నారు. అమరీందర్ సింగ్ తనకు సొంత కుటుంబం వంటివారని... ఆయనకు నేను కాదని చెప్పలేనని తెలిపారు.

దేశంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి, జగన్ కోసం పని చేశారు. ఏపీలో వైసీపీ ఘన విజయం వెనుక ప్రశాంత్ కిశోర్ టీమ్ కృషి ఉందని వైసీపీ నేతలు చాలా సార్లు ప్రకటించారు. ఇప్పటికి కూడా జగన్ తో సంబంధాలు కొనసాగిస్తున్నారు పీకే.



మరింత సమాచారం తెలుసుకోండి: