గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గతంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా.. ఈసారి దాన్ని కచ్చితంగా అమలు చేస్తామన్నారు, వారి వద్దనుంచి సెల్ ఫోన్లు తీసేసుకోవాలని, వాలంటీర్లు ఎక్కడైనా ప్రచారంలో పాల్గొంటే ఫిర్యాదులివ్వాలని సూచించారు. ఆయన నిర్ణయంపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వాలంటీర్లు వైసీపీ మద్దతుదారులు కాదని, కేవలం ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు మరింత మెరుగ్గా ఉండేందుకు పని చేస్తున్న స్వచ్ఛంద సేవకులని అంటున్నారు. అయితే ప్రభుత్వం ఏకంగా ఈ వ్యవహారంపై కోర్టుకి వెళ్లడం మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అంశం.

మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు వలంటీర్లను దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేసింది.  ఆ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ సచివాలయాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌ జైన్‌ అత్యవసర వ్యాజ్యం దాఖలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్లు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారనే ఫిర్యాదులు అందాయనే కారణంతో పురపాలక ఎన్నికల్లో వారిని దూరంగా ఉంచుతామనడం సరికాదని ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదించారు. పెన్షన్లు, రేషన్‌ అందించడం వాలంటీర్ల విధుల్లో భాగమని.. పెన్షన్లు ఇచ్చే సమయంలో సెల్‌ ఫోన్లలో బయోమెట్రిక్‌ ద్వారా ఖరారు చేయాల్సిన బాధ్యత వారిపై ఉందని, సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకుంటే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని వివరించారు. ఎస్‌ఈసీ ఉత్తర్వులతో పింఛన్ల పంపిణీ నిలిచిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. అధికార పరిధి దాటి ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసిందని.. ఆ ఉత్తర్వులు చట్ట విరుద్ధమని తమ వాదనల్లో పేర్కొన్నారు.

అయితే కేసు విచారణ ప్రారంభించిన న్యాయమూర్తులు.. పూర్తి స్థాయి వాదనలు వినేందుకు కేసుని నేటికి వాయిదా వేశారు. విచారణలో ఏ విషయం తెేలినా.. అసలు ప్రభుత్వం ఈ వ్యవహారంలో కోర్టు వరకు ఎందుకు వెళ్లిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వాలంటీర్లు లేని సమయంలో కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను తాము అందించామని, ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే ఏ పనీ జరగదన్నట్టు ప్రభుత్వం వాదిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై గతంలోనే టీడీపీ సహా ఇతర పార్టీలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాయి కూడా. ఈ నేపథ్యంలో వాలంటీర్ల సేవలకోసం వైసీపీ తహతహలాడిపోతోందని, అందుకే కోర్టు మెట్లెక్కిందని అంటున్నారు టీడీపీ నేతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: