ఏపీ డేంజర్ జోన్ లో పడిపోయింది. ఈ ఏడాది అత్యథిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే జోన్ లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. కరోనా విలయం తగ్గిపోతుందనుకుంటున్న టైమ్ లో అత్యథిక ఉష్ణోగ్రతలు మరోసారి రాష్ట్ర వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయి. ఈపాటికే ఎండ సెగ బాగా తగులుతోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. మార్చి మొదట్లోనే వాతావరణం ఇలా ఉంటే.. ఇక మే నెలలో ఎండలు ఎలా ఉంటాయోననే ఆందోళన అటు ప్రజల్ని కూడా పట్టి పీడిస్తోంది.

ఈ ఏడాది వేసవి కాలంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మార్చి-మే మధ్య ఎండలు ఎలా ఉండబోతున్నాయన్న అంచనాను తాజాగా ఐఎండీ వెల్లడించింది. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని పేర్కొంది. దక్షిణ, మధ్య భారత్ ‌లో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగానే ఉండొచ్చని అంచనా వేసింది. ఉత్తర భారతంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగానే ఉండొచ్చని పేర్కొంది. తూర్పు, పశ్చిమ ప్రాంతాలతో పాటు, సముద్ర తీరాల వద్ద అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది.

సహజంగానే సముద్ర తీరాల వధ్య ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయి. ఈ వేసవిలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు ఐఎండీ శాస్త్రవేత్తలు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలయిన ఆంధ్ర ప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌, ఒడిశా తీర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ఏప్రిల్‌-జూన్‌ కి సంబంధించిన వేసవి అంచనాలను ఐఎండీ ఏప్రిల్‌ లో విడుదల చేస్తుంది.

అధిక ఉష్ణోగ్రతల భయం ఉన్నా కూడా.. ఏపీలో ఇటీవల భారీ వర్షాలతో భూగర్భ జలవనరులు పెరిగాయి. ప్రాజెక్ట్ ల్లో కూడా నీరు సమృద్ధిగా ఉంది, అటు వ్యవసాయానికి సరిపడా నీటిని నిల్వ ఉంచుతూనే.. తాగునీటి అవసరాలకు జలవనరులను జాగ్రత్తగా వాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వేసవి నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అధికారులు కొన్ని చోట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: