కరోనా చైనాలో పుట్టి, ప్రపంచ వ్యాప్తమైందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత సెకండ్ వేవ్ పేరుతో పుట్టుకొస్తున్న కొత్త వైరస్ లు మాత్రం ఎక్కడ పుట్టాయో, ఎక్కడికి వ్యాపిస్తున్నాయో ఓ స్థిరమైన అంచనాకు రాలేకపోతున్నారు శాస్త్రవేత్తలు. కొత్తరకం కరోనా వైరస్ లక్షణాలు ముందుగా బ్రిటన్ లో వచ్చాయని, కాదు కాదు బ్రెజిల్ లో బయటపడ్డాయని వాదనలు కొనసాగుతున్నాయి. ఓ దశలో తమ దేశం పేరుతో కరోనా పేరుని జతకలిపి ప్రచారం చేయడం సరికాదని ఇరు దేశాలు ఇతర ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాయి కూడా. అయితే ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్యే అసలైన కరోనా వార్ జరుగుతుందని తెలుస్తోంది.

బ్రిటన్ టైప్ వైరస్ కంటే, బ్రెజిల్ టైప్ వైరస్సే డేంజర్ అని అంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. అత్యంత వేగంగా వ్యాప్తిచెందడమే కాకుండా యాంటీబాడీలను క్షీణింపచేయడంలో బ్రెజిల్ రకం వైరస్‌ తీవ్ర ప్రభావం చూపిస్తుందని లండన్‌ లోని ఇంపీరియల్‌ కాలేజీ నిపుణులు పేర్కొన్నారు. బ్రెజిల్‌ రకం వైరస్‌ బ్రిటన్ లోవ్యాపించడం కాస్త అప్రమత్తం కావాల్సిన విషయమే అయినా, భయపడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో బ్రెజిల్ టైప్ వైరస్ సోకిన ఓ వ్యక్తి బ్రిటన్ లో మిస్సవ్వడం కలకలం రేపుతోంది. ప్రమాదకరంగా భావిస్తోన్న బ్రెజిల్‌ రకం కరోనా సోకిన వ్యక్తి ఆచూకీ అందుబాటులో లేదని తేలడంతో ముందుగా అధికారులు షాకయ్యారు. వెంటనే అప్రమత్తమైన బ్రిటన్‌ ప్రభుత్వం.. అతను ఎక్కడ ఉన్నా అధికారుల ముందుకు రావాలని బహిరంగ విజ్ఞప్తి చేసింది. రెండోసారి కరోనా వైరస్‌ విజృంభణతో సతమతమవుతోన్న బ్రిటన్‌లో ఇప్పటివరకు బ్రెజిల్‌ రకం కేసులు ఆరు బయటపడ్డాయి. స్కాట్ లాండ్ ‌లో 3, సౌత్ ‌వెస్ట్‌ ఇంగ్లాండ్‌లో 2 కేసులు నిర్ధారణ అయ్యాయి. మరోకేసుకు సంబంధించిన వ్యక్తిని మాత్రం కనుక్కోలేకపోయారు అధికారులు. కొవిడ్‌ టెస్టు చేయించుకున్న తర్వాత ఆ వ్యక్తి తన వివరాలను నమోదు చేయకుండానే వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే తేరుకున్న ప్రభుత్వం అతడ్ని వెదికి పట్టుకునే పనిలో ఉంది. ఆ వైరస్ మరింత మందికి వ్యాపింపజేసే లోగా అతడ్ని పట్టుకోవాలని చూస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: