తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామని చెబుతున్న వైఎస్ షర్మిల పార్టీ ప్రకటనకోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆల్రడీ పార్టీ ప్రకటనకు ఆమె మహూర్తం ఫిక్స్ చేశారని, అందుకే సభలు, సమావేశాలు, చర్చలు అంటూ.. వేగంగా మిగతా అన్ని పనులు పూర్తి చేస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణలో అన్ని జిల్లాల నాయకులతో సమావేశం అవుతూనే, మరోవైపు యూనివర్సిటీ విద్యార్థులు, ఇతర వర్గాలతో కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు షర్మిల. ఏప్రిల్ 9వరకు అన్ని సమావేశాలు పూర్తి చేసుకుని, అదేరోజు పార్టీ ప్రకటిస్తారని అంటున్నారు. ఈమేరకు షర్మిల తరపున ఆమె అనుచరుడు తూడి దేవేందర్ రెడ్డి పరోక్షంగా మీడియాకి హింట్ ఇచ్చారు.

వైఎస్‌ షర్మిల ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ విధి విధానాలను, భవిష్యత్‌ రాజకీయ ప్రయాణాన్ని ఏప్రిల్‌ 9న ప్రకటించే అవకాశం ఉందని అన్నారు తూడి దేవేందర్‌రెడ్డి. ఉమ్మడి జిల్లాల వారీగా వైఎస్‌ అభిమానులతో నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలన్నీ ఏప్రిల్ 9లోపు పూర్తవుతాయని చెప్పారు. ఈ సమావేశాల్లో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అమరుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయా? అన్న సమాచారం తెలుసుకుంటున్నామని వివరించారు. అన్ని జిల్లాల ఆత్మీయ సమావేశాల తర్వాతనే పార్టీ ఏర్పాటు ప్రకటన ఉంటుందన్నారు. ఏప్రిల్‌ 9న ఖమ్మంలో ఆత్మీయ సమావేశం తర్వాత ఇందుకు అవకాశం ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారాయన.

ఇప్పటికే పలు కుల సంఘాల నేతలు, మైనార్టీలు, వివిధ మీడియా సంస్థల అధినేతలు షర్మిలను కలిసి మద్దతు తెలిపారు. అలాగే పలువురు టీవీ నటులూ షర్మిలను కలిసి సంఘీబావం ప్రకటించారు. షర్మిల సమావేశాలకు వచ్చినవారంతా.. ఇప్పుడున్న తెలంగాణ.. అందరి తెలంగాణగా మారాలని, కోరుకున్న అభివృద్ధి అందరికీ చెందాలని, యువత, మహిళా సమాజానికి అండగా నిలిచేందుకు షర్మిలతో కలసి నడుస్తామని చెబుతున్నారట. ఈ నేపథ్యంలో ఈరోజు మహబూ బ్‌నగర్‌ జిల్లా అభిమానులతో లోటస్ పాండ్ లో షర్మిల సమావేశం అవుతున్నారు. జిల్లా సమస్యలు, సాగునీరు.. తదితర అంశాలపై అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఇప్పటివరకు నల్గొండ, హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల సమావేశాలు పూర్తయ్యాయి. మహబూబ్‌ నగర్ సమావేశం నేటితో పూర్తయితే.. మిగిలిన 6 జిల్లాల ఆత్మీయ సమావేశాలు ఏప్రిల్‌ 9లోపు పూర్తి చేస్తారని అఁటున్నారు. చివరి ఆత్మీయ సమావేశం ఏప్రిల్‌ 9న ఖమ్మంలో జరుగుతుంది. అక్కడే పార్టీని ప్రకటిస్తారని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: