త‌మిళ సంస్కృతి సంప్ర‌దాయాల‌పై కేంద్రంలో ఉన్న బీజేపీకి ఏమాత్రం గౌర‌వం లేద‌ని రాహుల్‌గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీని- అన్నాడీఎంకేను టార్గెట్ చేస్తూ రాహుల్‌గాంధీ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. తమిళనాడులో ఎన్నికల వేళ భాజపా, కాంగ్రెస్‌ నేతల మధ్య విమర్శల పర్వం తారా స్థాయికి చేరుకుంది. రాహుల్‌గాంధీ భాజపాపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించకుండా.. కేంద్రం చేతిలో కీలుబొమ్మ‌లా మారార‌ని ధ్వ‌జ‌మెత్తారు.  సోమవారం కన్యాకుమారిలో నిర్వహించిన రోడ్‌షోలో బీజేపీ, అన్నా డీఎంకే తీరుపై రాహుల్ ఆరోప‌ణ‌ల‌ను విసిరారు.


‘‘తమిళ సంస్కృతిని అవమానించేలా ఆర్‌ఎస్‌ఎస్‌కు పళనిస్వామి అవకాశం ఇవ్వొద్దు. మరోవైపు మోదీ‘ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర’ అని చెబుతున్నారు. మరి తమిళం భారతీయ భాష కాదా? తమిళ చరిత్ర, సంస్కృతి భారత దేశానికి చెందినవి కావా? ఒక భారతీయుడిగా.. తమిళ సంస్కృతిని కాపాడటం నా ధర్మం’’ అంటూ ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. ‘ప్రధాని మోదీ సహా కేంద్రంలోని నాయకులు ఎవరూ తమిళ సంస్కృతిని గౌరవించరు. ఇక్కడ ఉన్న సీఎం కేంద్రంలో ఉన్నవారు ఏం చెబితే అదే చేస్తారంటూ పేర్కొన్నారు.  ఆయన రాష్ట్రానికి సీఎంగా వ్యవరించడం లేదు. మోదీకి ఏం కావాలో ఆయన అది చేస్తుంటారు’ అంటూ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.


ఇదిలా ఉండ‌గా తమిళనాడులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బిజీ బిజీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోడ్ షోలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ములంగుమూడులో పర్యటించిన ఆయన సెయింగ్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు పదో తరగతి విద్యార్థులు రాహుల్ గాంధీకి ఫిట్‌నెస్ ఛాలెంజ్ విసిరారు. మెరిన్ షెలిఘో అనే విద్యార్థిని రాహుల్‌తో పుష్ అప్స్‌ పోటీకి దిగింది. ఇద్దరు పోటా పోటీగా పుష్ అప్స్ తీశారు. 50 ఏళ్ల వయసులోనూ రాహుల్ గాంధీ ఫిట్‌గా కనిపించారు. 15 ఏళ్ల పిల్లలకు ధీటుగా పుష్‌అప్స్ తీశారు.






మరింత సమాచారం తెలుసుకోండి: