పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన- వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ మధ్య ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్.. ఈ అంశంపై స్పందించడంతో ఈ ఇష్యూ బాగా ఫోకస్ అయ్యింది. అయితే అసలు  మత్స్యపురి ఘటనకు అసలు కారకులు ఎవరో ఇప్పుడు జనసేన నాయకులు బయటపెడుతున్నారు. అతని పేరు చిగురుపాటి సందీప్‌ అట. ఇతని వైసీపీ కార్యకర్త అని.. ఈయన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు సన్నిహితుడని జనసేన చెబుతోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయపెట్టింది.

సదరు చిగురుపాటి సందీప్‌ గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించాడని జనసేన చెబుతోంది. అయితే అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏం జరిగింది.. మత్స్యపురి పంచాయతీలో సర్పంచ్ గా జనసేన బలపర్చిన కారేపల్లి శాంతిప్రియ గెలుపొందారు. అయితే విజయోత్సవ ర్యాలీలో జనసేన కార్యకర్తలు కాల్చిన బాణసంచా ఓ మహిళ చీరకొంగుకు అంటుకుంది. అయితే ఆ మంటలు వెంటనే జనసేన కార్యకర్తలు ఆర్పేశారు.


అయితే ఈ చిన్న ఇష్యూను పెద్దది చేసేందుకు వైసీపీ ప్రయత్నించిందని జనసేన అంటోంది. ఈ అంశంపైనే భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పందించారు. "పవన్ ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? ఎన్నికల సంఘం అనుమతులు లేకుండానే ర్యాలీ నిర్వహించారు. ప్రతి వైసీపీ కార్యకర్త ఇంటికి టపాసులు కట్టి కాల్చడమే కాకుండా వారిని భయభ్రాంతులకు గురిచేశారు. అంతేకాదు, దళితవాడలోనూ జనసైనికులు విధ్వంసం సృష్టించారు. ఓ మహిళపై దాడికి దిగారు" అని గ్రంధి శ్రీనివాస్ అన్నారు.


అంతే కాదు.. పవన్ స్టేట్ రౌడీ.. జనసేన నేతలు ఆకురౌడీలను ఘాటుగా విమర్శించారు. జనసైనికులు, జన మహిళలు అంటూ పేర్లు పెట్టి పవన్ వారిని ప్రజలపైకి ఉసిగొల్పుతున్నాడని... పార్టీ శ్రేణులను సంఘవ్యతిరేక శక్తులుగా తయారు చేస్తున్నాడని గ్రంథి శ్రీనివాస్ విమర్శించారు. మరి ఇప్పుడు జనసేన నేతలు అసలు కారకుడు ఈయన అంటూ చిగురుపాటి సందీప్‌ పేరు బయటపెట్టారు. మరి ఇప్పుడు వైసీపీ ఎలా స్పందిస్తుంది.. ఈ కేసు విచారణలో చిగురుపాటి సందీప్‌ ను విచారిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: