మహా విశాఖ నగర పాలక సంస్థ. దీన్ని షార్ట్ కట్ లో జీవీఎంసీ అని అంటారు. జీవీఎంసీ ఎన్నికలు ఈ నెల పదిన జరగనున్నాయి. దాదాపుగా 18 లక్షల పై చిలుకు ఉన్న ఓటర్లు తమ తీర్పుని చెప్పబోతున్నారు. ఓటర్ల నాడి ఎలా ఉంది అన్నది తీసుకుంటే విశాఖ మేయర్ పీఠం పట్టడం రెండు ప్రధాన పార్టీలకు చాలా కష్టమే అని చెప్పాల్సి ఉంటుంది.

అంటే ఒక విధంగా టఫ్ ఫైట్ అటు అధికార వైసీపీ, ఇటు విపక్ష టీడీపీల మధ్యన కేంద్రీకృతమై ఉందని చెప్పాలి. విశాఖ మేయర్ పీఠం రెండు పార్టీలకు కల. అంతే కాదు, ప్రతిష్ఠాత్మకం. ఇక టీడీపీ మేయర్ కుర్చీ ఒక మారు ఎక్కింది. ఆ రుచి చూసింది. కానీ ఇప్పటికి మూడున్నర దశాబ్దాల కాలం అయింది. దాంతో మళ్ళీ కుర్చీ ఎక్కాలని అలా తన స్థానాన్ని విశాఖలో పదిలం చేసుకోవాలని టీడీపీ ఆశలు పెంచుకుంటోంది.

అదే సమయంలో వైసీపీకి చూసుకుంటే ఇదే ఫస్ట్ టైం అనుభవం. విశాఖ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తూ మొదటి సారే పీఠం దక్కించుకోవాలని వైసీపీ చాలా గట్టిగానే ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో చేయాల్సినవి అన్నీ చేస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ అంటోంది. టీడీపీలో ఉన్న బలమైన నాయకులను లాగేసుకుంటోంది. అయితే ఎంత చేసినా టీడీపీకి గట్టి పట్టున్న వార్డులు కూడా చాలా మేరకు  ఉన్నాయి. అలాగే టీడీపీకి అంటూ కొన్ని వర్గాల ఓట్లు ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే టీడీపీ నుంచి వైసీపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. మొత్తానికి చూసుకుంటే మేయర్ సీటు పట్టడం ఎవరికీ అంత ఈజీ కాదు అన్న మాట మాత్రం వినవస్తోంది. ఇక అటూ ఇటూ అతిరధ మహారధులే ఎన్నికల ప్రచారంలో దిగిపోతున్నారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు విశాఖలోనే మకాం వేశారు. అదే విధంగా వైసీపీకి ఎంపీ విజయసాయిరెడ్డి పెద్ద అండగా ఉన్నారు. మంత్రి అవంతి శ్రీనివసరావుతో పాటు చాలా మంది కీలక నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: