రాజకీయం జోరుగా సాగుతోంది. ఏపీలో ఎన్నికల కాక చాలా తీవ్రంగా ఉంది. వేసవి కంటే ముందే ఏపీ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కిపోయింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు అన్ని పార్టీలను ఒక్కసారిగా నిద్రలేపాయి. దాంతో తమ సత్తా చాటేందుకు ఎవరి మటుకు వారు రంగంలోకి దిగిపోతున్నారు.

పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులు లేకుండా జరిగాయి. దాంతో ఎవరికి వారే తామే ఎక్కువ సీట్లు గెలిచామని బాగానే క్లెయిం చేసుకున్నారు. ఇక ఇపుడు మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో పాటు పార్టీ గుర్తులు ఉన్నాయి. ఇక నేతాశ్రీలు ఊరుకుంటారా. అందుకే రంగంలోకి దిగిపోతున్నారు. రాష్ట్రంలో  ఇపుడు అధినాయకులు ప్రచార పర్వంలోకి దిగిపోతున్నారు. చంద్రబాబు మునిసిపల్ ఎన్నికల్లో కీలకమైన చోట్ల ప్రచారం చేయడానికి అంగీకరించారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఇక చంద్రబాబు విశాఖ టూర్ ఉంటుందని అంటున్నారు. విశాఖ మేయర్ పీఠాన్ని కైవశం చేసుకోవడానికి టీడీపీ మాస్టర్ ప్లాన్ తో ముందుకు సాగుతోంది. దాంతో కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాన్ని పీక్స్ తీసుకువెళ్ళడానికి బాబు రెడీ అవుతున్నారు. ఆయన విశాఖలో విసృతంగా ప్రచారం చేపడతారు అని అంటున్నారు. ఇక విశాఖలో ప్రచారానికి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ కూడా వస్తారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. విశాఖలోని గాజువాకలో గత ఎన్నికల్లో పవన్ పోటీ చేశారు. పైగా ఇక్కడ జనసేనకు కొంత బేస్ ఉంది. దాంతో ఈసారి కొన్ని అయినా కార్పొరేటర్లను గెలుచుకోవాలని ఆ పార్టీ ఆరాటపడుతోంది. ఎటూ బీజేపీతో పొత్తు ఉంది. ఈ కూటమి తరఫున ప్రచారం చేసేందుకు పవన్ వస్తారని అంటున్నారు. దాంతో విశాఖ రాజకీయం వేడెక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పాలి. విశాఖలో బీజేపీకి కొంత బలం ఉంది. గతంలో కూడా కొన్ని కార్పోరేట్ సీట్లు గెలుచుకుంది. ఇపుడు జనసేన కూడా తోడు కావడంతో గట్టిగా పోరాడాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: