చైనా.. ప్రపంచానికే ప్రమాదకారిగా మారుతున్న దేశం. ఆధిపత్య పైత్యంతో అడ్డదారులు తొక్కుతున్న దేశంగా అపకీర్తి మూటగట్టుకుంటోంది. మిగిలిన ప్రపంచం సంగతి ఎలా ఉన్నా.. ఇండియాకు చైనా పక్కలో బళ్లెం లాంటిదే.. ఈ విషయంలో అనుమానం లేదు. అందుకే ఇండియా సాధ్యమైనంత వరకూ తన జాగ్రత్తలో ఉంటోంది. సరిహద్దుల్లోనూ పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే.. చైనా ఇండియాపై అన్ని విధాలుగా దాడికి యత్నిస్తోందట. కేవలం సైన్యం పరంగానే కాదు.. టెక్నాలజీతోనూ దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తోందట. ప్రయత్నించడం కాదు.. ఇప్పుటికే కొన్ని ట్రయల్స్ కూడా వేసిందట. ఈ భయంకరమైన వాస్తవాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.

భారత్‌లో తయారవుతున్న కరోనా టీకా కంట్రోల్స్ ను హ్యాక్ చేసేందుకు చైనా ప్రయత్నించిందట.  చైనాలోని ఓ హ్యాకింగ్ గ్రూప్  సీరం ఇన్‌స్టిట్యూట్ భారత్ బయోటెక్‌లను టార్గెట్ చేసుకుందన్న వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. కొవిషీల్డ్ టీకా వివరాలను దొంగిలించేందుకు చైనా సీరం ఇన్‌స్టిట్యూట్‌ కంప్యూటర్లలోకి మాల్ వేర్ ప్రవేశపెట్టిందని సైబర్ సెక్యురిటీ సంస్థ సైఫార్మా ప్రకటించడం సంచలనంగా మారింది. భారత్‌లో కరోనా టీకాలు తయారు చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ ఐటీ వ్యవస్థల్లోకి మాల్ వేర్ చొప్పించిందట చైనా హ్యాకింగ్ సంస్థ.

చైనా హ్యాకింగ్ గ్రూప్ స్టోన్ పాండా సీరం, భారత్ బయోటెక్ ఐటీ వ్యవస్థల్లోని లోపాలను గుర్తించి మాల్‌వేర్ చొప్పించిందని సైఫార్మా  చెబుతోంది. టీకాలకు సంబంధించిన మోధోసంపత్తి హక్కుల వివరాలను తస్కరించి భారత ఫార్మా కంపెనీలపై పైచేయి సాధించాలనేది  చైనా హ్యాకింగ్ గ్రూప్ లక్ష్యంగా సైఫార్మా చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడవుతున్న టీకాల్లో 60 శాతం భారత్‌లోనే తయారయ్యాయి. ఇది చైనా కంపెనీలకు కడుపుమంటగా మారిందట. అందుకే భారత్‌ టీకా వివరాలను చైనా తసర్కించేందుకు ప్రయత్నించిందట.

ఈ వార్తలు బయటకు రావడంతో  ప్రభుత్వ నిపుణులు సీరం ఐటీ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారట. సీరం ఇన్ స్టిట్యూట్‌కు చెందిన అనేక పబ్లిక్ సర్వర్ల సెక్యురిటీ వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయని వీరు గుర్తించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా భారతీయ విద్యుత్ వ్యవస్థలను, కరోనా కంట్రోల్స్ ను.. ఇలా చైనా హ్యాకర్లు దేన్నీ వదలడం లేదన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: