మున్సిపల్‌ పోరులో టీడీపీకి ముందే చుక్కలు కనబడుతున్నాయి. ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇక ఇప్పుడు న‌గ‌ర‌, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అయినా పార్టీ ప‌రువు కాపాడుకుంటుంద‌ని అనుకుంటే ఇక్క‌డ కూడా చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయి. నామినేషన్‌ వేసిన అభ్యర్థులు కూడా బరిలో ఉండలేమంటూ చేతులెత్తేస్తున్నారు. మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన ప‌లాస‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీ , బీజేపీ నుంచి కౌన్సెల‌ర్లుగా నామినేష‌న్లు వేసిన వారు సైతం మంత్రి స‌మ‌క్షంలో వైసీపీలో చేరిపోయారు. నామినేష‌న్ల ప‌ర్వం పూర్త‌య్యేలోగా ఇంకెంతమంది ఉపసహకరించుకుంటారోనన్న టెన్షన్‌ టీడీపీ నేతల్లో మొదలైంది.  

ప‌లాసలో టీడీపీ నాలుగో వార్డు అభ్య‌ర్థి వాయిలపల్లి శ్రీనివాసరావు, 20వ వార్డుకు నామినేషన్‌ వేసిన బమ్మిడి వెంకటలక్ష్మి, 29వ వార్డు అభ్యర్థి సనపల దీప్తి,  ఎనిమిదో వార్డుకు నామినేషన్‌ వేసిన రోణంకి మురళీకృష్ణ వైసీపీలో చేరిపోయారు. దీంతో ఆ మూడు వార్డుల్లో టీడీపీ విల‌విల్లాడుతోంది. ఈ మున్సిపాల్టీలో టీడీపీకి మాత్ర‌మే కాదు.... బీజేపీకి కూడా ఆ పార్టీ కౌన్సెల‌ర్ అభ్య‌ర్థులు దిమ్మ‌తిరిగే షాక్ ఇస్తున్నారు. మున్సిపాలిటీలోని 21వ వార్డుకు నామినేషన్‌ వేసిన దేవరశెట్టి బాలాజీ గుప్తా, 26వ వార్డుకు నామినేషన్‌ వేసిన మళ్లా రమ్య ఎన్నికలకు ముందే వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. ఒకటి రెండు చోట్ల నామినేషన్‌ వేసిన బీజేపీ అభ్యర్థులు కూడా బరిలో నుంచి తప్పుకుంటున్నారు.

మంత్రి అప్ప‌ల‌రాజు ప్ర‌త్యేక‌మైన ప్లానింగ్‌తో మున్సిపాల్టీలో టీడీపీ, బీజేపీకి చెక్ పెట్టేశారు. పలాస‌లో మాత్రమే కాదు.... పాల‌కొండ న‌గ‌ర పంచాయ‌తీలోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. ఏదేమైనా ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీ జోరు ముందు సైకిల్‌, కాషాయా రెండూ ఎన్నిక‌ల‌కు ముందే చిత్త‌వుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: