పుర‌పాల‌క సంఘాల్లో ఎలాగైనా పాగా వేయాలి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగ‌రాలి.. చైర్మ‌న్ స్థానంలో అధికార పార్టీవారే కూర్చోవాలి.. దీనికోసం సామదాన దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. పురపాలక ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాల కోసం వైసీపీ ప్రయత్నాలు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. . బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు. ఆ లోగా తమకు పోటీగా నామినేషన్లు వేసిన వారితో ఉపసంహరించుకునేలా చేసేందుకు అధికార పార్టీ నాయకులు ఎక్కడికక్కడ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే కొన్ని చోట్ల కేసులతో బెదిరింపులు.. డబ్బులతో ప్రలోభాలకు గురి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. గెలిచేది మేమే.. అధికారం మాదే..  మధ్యలో మీరేంటంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన వారు ఉపసంహరించుకుంటే రాబోయే మూడేళ్లలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కొన్నిచోట్ల బుజ్జగిస్తున్నారు.


మాచర్ల పురపాలక సంఘం ఎన్నికల్లో ఒక్క వార్డుకు కూడా పోటీ చేయలేని స్థితిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఉంది. గ‌తేడాది కరోనాతో వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ కొనసాగడం టీడీపీని ఇరకాటంలోకి నెట్టింది. అప్పట్లో 31 వార్డులకు పది వార్డులకు కేవలం వైసీపీ అభ్యర్థులే నామినేషన్లు వేసేశారు. మిగతా 21 వార్డుల్లో ఒకరికి మించి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే పోటీ జరుగుతున్న ఈ వార్డుల్లో అధికార పార్టీ అభ్యర్థులు, వారి డమ్మీలు మాత్రమే నామినేషన్లు వేయడం గమనార్హం. ఈ నెల 3న నామినేషన్ల ఉప సంహరణ జరగనుంది. ఈ క్రమంలో డమ్మీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుంటే సింగిల్‌ నామినేషన్‌ పడ్డ పది వార్డులతోపాటు మొత్తం 31 వార్డులు వైసీపీకి ఏకగ్రీవం కానున్నాయి.

మాచ‌ర్ల‌లో బ‌లంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పుర‌పాల‌క ఎన్నికల్లో నామినేషన్లు ఎందుకు వేయలేదన్న ప్రశ్న అనేక సందేహాలను కలిగిస్తోంది. టీడీపీ అధికారం కోల్పోయాక నియోజకవర్గ స్థాయి ఒకరిద్దరు నేతలు తప్ప మిగిలిన వారు వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి చలమారెడ్డి వద్ద పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి బీ-ఫారాలున్నా అవి తీసుకుని పోటీ చేసేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డంలేదు. నామినేషన్‌ ప్రక్రియ సంద‌ర్భంగా  చలమారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ బందోబ‌స్తు చూసిన అభ్య‌ర్థులు సైతం వెనుదిరిగి వెళ్లారు. అలా పంపాల‌న్న‌దే వైసీపీ వ్యూహ‌మ‌ని చెబుతున్నారు. అయితే దీనిని ఎవ‌రూ ఇంత‌వ‌ర‌కు ధ్రువీక‌రించ‌లేదు. చ‌ల‌మారెడ్డి ఇంటివ‌ద్ద పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌డానికి కార‌ణం శాంతిభ‌ద్ర‌త‌ల‌ని పోలీసులు చెబుతున్నారు. అస‌లు విష‌యం మాత్రం అధికార పార్టీ నేత‌ల‌కే తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: