ఏడాది కింద‌ట మునిసిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొంత ముగిసింది. ఆ స‌మ‌యంలో పార్టీ తరఫున టిక్కెట్‌ ఆశించి అవకాశం దక్కక నామినేషన్లు వేసిన రెబల్‌ అభ్యర్థుల్లో పలువురు బుజ్జగింపుల కోసం ఎదురు చూస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తేదీ మరో  వారం రోజుల్లోకి వచ్చేసిన నేపథ్యంలో ఈ లోపు నాయకులు తమ వద్దకు వచ్చో, పిలిపించో మాట్లాడి హామీలు ఇవ్వాలని ఆశిస్తున్నారు. కొందరు అభ్యర్థులు తమని పిలిస్తే ఇప్పటివరకు పెట్టిన ఖర్చుతో పాటు పార్టీ గెలిస్తే ఫలాన పదవి ఇస్తామన్న హామీని తీసుకోవాలని ఎత్తులు వేస్తున్నారు. ఇందుకోసం తమ అనుచరులతో సమావేశాలు, కార్యాలయాల ప్రారంభోత్సవాలు వంటివి చేస్తూ నాయకుల కళ్లల్లో పడేందుకు ప్రయత్నిస్తున్నారు.

రేపు సాయంత్రంలోగా నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ ముగియ‌నుండ‌గా గుంటూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ‌కు చెందిన రెబ‌ల్ అభ్య‌ర్థులు అధికారిక అభ్య‌ర్థుల‌ను హ‌డ‌లెత్తిస్తున్నారు.   వైసీపీ, టీడీపీ తరఫున పలు వార్డుల్లో రెబల్స్ పోటీలో ఉన్నారు.  ఇప్పటికే టిక్కెట్‌ ఖరారైన అభ్యర్థులు తమ వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు వేయమని అభ్యర్థిస్తున్నారు. ఇటువంటి వాతావ‌ర‌ణంలో కొంతమంది రెబల్స్‌ వారికి పోటీగా రాజకీయం నడుపుతున్నారు. ఇక ఎలాగూ తమకు పార్టీ టిక్కెట్‌ ఖరారు చేయదనే నిర్ణయానికి వచ్చిన కొందరు అభ్య‌ర్థులు నామినేషన్‌ ఉపసంహరించుకొనేందుకు కొన్ని డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు.

ఇప్పటివరకు ఎన్నిక‌ల్లో తాము పెట్టిన ఖర్చును  ప్రస్తావిస్తున్నారు. గత ఏడాది పెట్టిన ఖర్చు, వార్డులో నిర్వహించిన పార్టీ కార్యక్రమాలకైన మొత్తాన్ని లెక్కలతో సహా నాయకులకు నివేదించి ఆ మొత్తాన్ని పార్టీ అధికారిక అభ్యర్థి నుంచి ఇప్పించాలని ఒత్తిడి చేస్తున్నారు. అలానే తమకు కో-ఆప్షన్‌ మెంబర్‌/పార్టీలో కీలక పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇకపై ఏ కార్యక్రమానికైనా  పార్టీ అభ్యర్థి తమని  కలుపుకుపోవాలని షరతు పెడుతున్నారు. తమకు ప్రత్యర్థి పార్టీ నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని చెబుతున్నారు. దీంతో వారిని బుజ్జగించడం వైసీపీ, తెలుగుదేశం నాయకులకు తలనొప్పిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: